Chandrababu : చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారా? ఆ పోస్టులను భర్తీ చేయాలని అనుకోవడం లేదా?
నవసర ఖర్చులు తగ్గించుకుంటేనే కొంతలో కొంత వరకైనా సమస్య నుంచి బయటపడవచ్చన్నది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆలోచన
ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి ఏ మాత్రం బాగా లేదు. ఇప్పటికే ఒకటో తేదీన పింఛన్లతో పాటు ఉద్యోగులకు జీతాలు చెల్లించాలంటే అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రతి నెల అప్పుల కోసం వెతుక్కోవాల్సి వస్తుంది. ఖజానా వెలవెల పోతుంది. అడుగు ముందుకు వేయాలన్నా నిధుల లేమి వెనక్కు లాగుతుంది. గతంలో మాదిరిగా లేదు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పరిస్థితి. అనవసర ఖర్చులు తగ్గించుకుంటేనే కొంతలో కొంత వరకైనా సమస్య నుంచి బయటపడవచ్చన్నది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆలోచన. ఈ మేరకు ఆయన కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. కొన్ని పోస్టులను భర్తీ చేయకూడదని నిర్ణయించుకున్నట్లు సమాచారం.
నామమాత్రమే అయినా...
అందిన సమాచారం మేరకు 2014 నుంచి 2019 వరకూ చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో సలహాదారులున్నారు. వివిధ శాఖలకు సంబంధించి ఆయన సలహాదారులను నియమించారు. ఇవి కేవలం పార్టీ నేతలకు ఏదో ఒక పదవి ఇవ్వడం కోసమే. నిజానికి సలహాదారులు ఇచ్చే సలహాలను ప్రభుత్వాలు ఏవీ తీసుకోవు. వారు నామమాత్రంగానే ఉంటారు. కాకుంటే పార్టీ కోసం కష్టపడిన వారికి రాజకీయ ఉపాధి కల్పించి సంతృప్తి పర్చేందుకే సలహాదారులను నియమించుకుంటూ వస్తున్నారు. నిజానికి ముఖ్యమంత్రి నుంచి మంత్రుల వరకూ ఐఏఎస్ లు ఉంటారు. వారి సహకారం, సలహాలు, సూచనలతో కొంత అవగాహన ఏర్పడుతుంది.
నలభై మందికి
గత వైసీపీ ప్రభుత్వమయితే సలహాదారుల సంఖ్యను విచ్చలవిడిగా నియామకం చేపట్టింది. అవసరమున్నా లేకపోయినా ముఖ్యమంత్రి, ప్రభుత్వ సలహాదారులంటూ దాదాపు నలభై మందిని వైసీపీ ప్రభుత్వం నియమించుకుంది. వీరికి నెలకు లక్షల్లో వేతనం ఉంటుంది. అంటే పారితోషికంగా ఇస్తారు. ఇక వీరికి వసతులతో పాటు, వాహనం, కార్యాలయం వంటి ప్రత్యేక సౌకర్యాలను ఏర్పాటు చేస్తారు. దాదాపు నలభై మందిని గత ప్రభుత్వం సలహాదారులుగా నియమించుకోవడాన్ని నాడు హైకోర్టు కూడా తప్పుపట్టింది. సలహాదారులకు కల్పించినన్ని సౌకర్యాలు న్యాయమూర్తులకు కూడా లేవని నాడు హైకోర్టు వ్యాఖ్యానించడం పరిస్థితికి అద్దం పడుతుంది.
కొంతకాలం పక్కన పెట్టాలని...
అందుకే ఈ నేపథ్యంలో చంద్రబాబు ఈసారి సలహాదారుల నియామకానికి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది. కేవలం నామినేటెడ్ పోస్టులను మాత్రమే భర్తీ చేయనున్నారు. ప్రభుత్వ ఖజానాకు తూట్లు పొడిచే ఈ సలహాదారుల నియామకాన్ని కొంత కాలం పక్కన పెట్టాలని చంద్రబాబు నిర్ణయించినట్లు తెలిసింది. ఆర్థిక వ్యవస్థ గాడిలో పడేంత వరకూ సలహాదారుల నియామకం జోలికి వెళ్లకూడదని ముఖ్యమంత్రి చంద్రబాబు డిసైడ్ అయినట్లు చెబుతున్నారు. గత ప్రభుత్వంలో నియమించుకున్న సలహాదారులను వ్యతిరేకించిన తామే సంక్షేమ పథకాలను పక్కన పెట్టి సలహాదారులను నియమించుకుంటే తప్పుడు సంకేతాలు వెళతాయని చంద్రబాబు భావిస్తున్నారు. సో... సలహాదారుల నియామకం ఆంధ్రప్రదేశ్ లో ఇప్పట్లో లేనట్లేనన్నది అధికార వర్గాల నుంచి వినిపిస్తున్న మాట.