సీఎం జగన్ పై అలీ సంచలన వ్యాఖ్యలు
ఏపీ ప్రభుత్వ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారు, సినీ నటుడు అలీ వైఎస్ కుటుంబంపై పొగడ్తల వర్షం కురిపించారు.
ఏపీ ప్రభుత్వ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారు, సినీ నటుడు అలీ వైఎస్ కుటుంబంపై పొగడ్తల వర్షం కురిపించారు. వైఎస్ ఫ్యామిలీకి మాట తప్పే అలవాటు లేదని అన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో నటుల్లో ఒకరికి కష్టం వచ్చిందని, అనారోగ్యంతో బాధపడుతున్న అతడిని ఆసుపత్రిలో చేర్చామని, నటులుగా అతడికి తమ వంతు సాయం చేశామని అలీ వెల్లడించారు. ప్రభుత్వం నుంచి కూడా ఏదైనా సాయం అందితే ఆ నటుడికి ఉపయోగకరంగా ఉంటుందని భావించి, నాటి ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి వద్దకు వెళ్లామన్నారు. ఆ నటుడు ఏ పార్టీకి చెందినవాడని చూడకుండా రాజశేఖర్ రెడ్డి ఆనాడు రూ.5 లక్షల సాయం అందించారని అలీ గుర్తు చేసుకున్నారు. వైఎస్సార్ నాడు ఆ నటుడిలో ఓ కళాకారుడ్ని మాత్రమే చూశారని స్పష్టం చేశారు. ఇది 15 ఏళ్ల నాటి మాట అని అన్నారు. ఇప్పుడు తండ్రి బాటలోనే సీఎం జగన్ కూడా నడుస్తున్నారని అలీ కొనియాడారు. సహాయం చేయడంలో జగన్ ఎప్పుడూ ముందుంటారని, అలాంటి కార్యక్రమాలకు పిలిస్తే తప్పకుండా వస్తారని తెలిపారు. పాత్రికేయులకు ఇళ్ల స్థలాలు ఇస్తామన్న మాటను జగన్ నిలబెట్టుకున్నారని, 11 వేల మంది పాత్రికేయ మిత్రులకు ఇళ్ల స్థలాలు ఇచ్చారని అలీ తెలిపారు.