Tirumala : తిరుమలలో తగ్గిన రద్దీ.. మెయిన్ కారణమిదే

తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది. ఆదివారం అయినా భక్తుల సంఖ్య స్వల్పంగానే ఉంది.

Update: 2024-09-01 02:45 GMT

తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది. ఆదివారం అయినా భక్తుల సంఖ్య స్వల్పంగానే ఉంది. బంగాళాఖాతంలో వాయుగుండం కారణంగా భారీ వర్షాలతో ప్రజలు తిరుమలకు చేరుకోలేకపోతున్నారు. అనేక రైళ్లు రద్దు కావడంతో కూడా భక్తులు స్వల్పంగానే తిరుమలలో ఉన్నారు. ఆదివారం సహజంగా భక్తుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. కానీ గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా దక్షిణ మధ్య రైల్వే పలు రైళ్లను రద్దు చేసింది. కొన్నిచోట్ల రైల్వే లైను కొట్టుకుపోవడంతో రైళ్ల రాకపోకలపై ఆ ప్రభావం పడింది. మరమ్మతులు యుద్ధ ప్రాతిపదికన చేస్తున్నప్పటికీ రైళ్లలో కొన్నింటిని రద్దు చేశారు. ఈ కారణంగానే తిరుమలలో నేడు భక్తుల సంఖ్య కొద్దిగానే ఉంది. స్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులకు పెద్దగా సమయం పట్టడం లేదని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు.

ఐదు కంపార్ట్‌మెంట్లలోనే
ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని ఐదు కంపార్ట్‌మెంట్లలోనే భక్తులు వేచి ఉన్నారు. ఉచిత దర్శనం క్యూ లైన్ లో ఉదయం ఏడు గంటలకు టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం ఎనిమిది గంటల సమయం మాత్రమే పడుతుంది. టైమ్ స్లాట్ దర్శనం కోసం వేచి ఉన్న భక్తులకు మూడు గంటల సమయం పడుతుంది. మూడు వందల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం రెండు గంట్లో పూర్తవుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. నేటి పుష్కరిణి లోకి భక్తులను అనుమతించనున్నారు. బ్రహ్మోత్సవాల నేపధ్యంలో తిరుమలలోని పుష్కరిణికి నెల రోజుల పాటు మరమ్మతులు చేపట్టారు. నేటి నుంచి పుష‌్కరిణి హారతిని పునరుద్ధించారు. నిన్న తిరుమల శ్రీవారిని 81,207 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 31,414 మంది భక్తులు తలనీలాలను సమర్పించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 4.53 కోట్ల రూపాయలు వచ్చిందని అధికారులు వెల్లడించారు.


Tags:    

Similar News