Tirumala : శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్... తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ... ప్రధాన కారణమిదేనట
తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది. గురువారం కావడంతో భక్తుల రద్దీ అంతగా లేదని అధికారులు చెబుతున్నారు
తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది. గురువారం కావడంతో భక్తుల రద్దీ అంతగా లేదని అధికారులు చెబుతున్నారు. రేపటి నుంచి తిరిగి భక్తుల రద్దీ పెరిగే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు. సహజంగా శుక్ర, శని, ఆదివారాల్లో భక్తులు అధిక సంఖ్యలో తిరుమలకు వస్తుంటారు. గురువారం కావడంతో కంపార్ట్మెంట్లలోనూ భక్తుల సంఖ్య పెద్దగా లేదు. స్వామి వారి దర్శనానికి కూడా పెద్దగా వేచి ఉండకుండానే భక్తులు వెళుతున్నారు. తిరుమల కొండలో భక్తుల రద్దీ తక్కువగా ఉండటంతో ఈరోజు తిరుమలకు చేరుకున్న వారికి సులువుగా శ్రీవారి దర్శనం అవుతుందని అధికారులు చెబుతున్నారు. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్వనం టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం మూడు గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు చెబుతున్నారు.
ఎనిమిది గంటలు...
ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని పది కంపార్ట్మెంట్లలోనే భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. ఉచిత దర్శనం కోసం ఉదయం ఏడు గంటలకు టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం ఎనిమిది గంటల సమయం పడుతుంది. టైమ్ స్లాట్ దర్శనం కోసం ఐదు కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. వీరికి శ్రీవారి దర్శనానికి నాలుగు గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. నిన్న తిరుమల శ్రీవారిని 67,916మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 23,010 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.93 కోట్ల రూపాయలు వచ్చిందని అధికారులు తెలిపారు. రేపటి నుంచి మళ్లీ రద్దీ పెరిగే అవకాశముంది. నేటి నుంచి శ్రీవారి పుష్కరిణిని మూసివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు.