ఏపీలో ఈ ఏడు జిల్లాలకు రెడ్ అలర్ట్.. రాత్రికి కుండపోతే..
ఇప్పటికే కురిసిన భారీ వర్షాలకు ఉమ్మడి కృష్ణా, గుంటూరు, గోదావరి జిల్లాల్లో లోతట్టు ప్రాంతాల్లోకి నీరు చేరింది. పట్టణాలు..
వాయువ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం.. మరికొద్ది గంటల్లో వాయుగుండంగా మారనుంది. ఇది ఉత్తరాంధ్ర తీరానికి సమీపంలో ఉండగా.. ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు కోస్తాంధ్ర జిల్లాలపై కూడా రానున్న 48 గంటల్లో తీవ్ర ప్రభావం చూపనుందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. గుంటూరు, ఎన్టీఆర్, కృష్ణా, ప్రకాశం, నెల్లూరు, కడప, తిరుపతి జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది. ఈ ఏడా జిల్లాల్లో మంగళవారం రాత్రి నుంచి 48 గంటల్లో కుండపోత వర్షాలు కురుస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరింది. అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని హెచ్చరించింది. విశాఖలో మంగళవారం రాత్రి నుంచి ఉదయం లోపు 10 - 15 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కావొచ్చని అంచనా వేసింది.
ఇప్పటికే కురిసిన భారీ వర్షాలకు ఉమ్మడి కృష్ణా, గుంటూరు, గోదావరి జిల్లాల్లో లోతట్టు ప్రాంతాల్లోకి నీరు చేరింది. పట్టణాలు, నగరాల్లోని ప్రధాన రహదారులపై నీరు చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పలు ప్రాంతాల్లో వాగులు, వంకలు పొంగిపొర్లుతూ.. కట్టలు తెగి రోడ్లపై నీరు ప్రవహిస్తుండటంతో గ్రామాల మధ్య రాకపోకలు స్తంభించాయి. ఎగువ నుంచి భారీమొత్తంలో గోదావరికి వరద వస్తుండటంతో ధవళేశ్వరం బ్యారేజీ 175 గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. వరదముప్పు పొంచి ఉన్న లంక గ్రామాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు.