విరుచుకుపడుతోన్న 'అసని'.. బాపట్లలో భారీ వర్షం
అసని తుఫాన్ ఏపీలోని తీరప్రాంత జిల్లాల్లో విరుచుకుపడుతోంది. భారీ వర్షాలతో గ్రామాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.
అసని తుఫాన్ విరుచుకుపడుతోంది. తీరప్రాంత బాపట్ల జిల్లాలో భారీ వర్షం కురుస్తోంది. బాపట్ల, రేపల్లె, నిజాంపట్నం ప్రాంతంలో ఎడతెరిపి లేకుండా వానలు కురుస్తున్నాయి. భట్టిప్రెలు, కొల్లూరు మండలాల్లోనూ భారీ వర్షం పడుతోంది. బాపట్లలో 8 సెం.మీ, వేటపాలెంలో 5.54 సెం.మీ వర్షం కురిసినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. తుఫాను తీవ్రతతో అధికారులు అప్రమత్తమయ్యారు. నిజాంపట్నం హార్బర్‌లో 8వ నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.
బాపట్ల జిల్లా కలెక్టరేట్‌లో కంట్రోల్ రూం ఏర్పాటు చేశారు. సహాయక చర్యల కోసం 87126 55878, 87126 55881, 87126 55918 నంబర్లకు ఫోన్ చేయాలని అధికారులు సూచిస్తున్నారు. తీరప్రాంత మండలాల్లోని తహసీల్దార్ కార్యాలయాల్లోనూ కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటయ్యాయి. ఇప్పటికే సముద్రంలోకి వేటకు వెళ్లొద్దని మత్స్యకారులకు హెచ్చరికలు చేశారు. లోతట్టు ప్రాంతంలోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.
అటు మరో తీరప్రాంత జిల్లా నెల్లూరులోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల కారణంగా ఇందుకూరుపేట మండలంలో రాత్రి నుంచి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. తుఫాన్ ప్రభావంతో విద్యుత్ లేక గ్రామాలు అంధకారంలో ఉన్నాయి. రొయ్యల చెరువుల రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చెరువులు కాపాడుకునేందుకు డీజిల్ మోటార్లతో విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. డీజిల్ కూడా దొరక్క ఇబ్బందులు పడుతున్నారు. నెల్లూరు జిల్లాలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది.మైపాడు బీచ్ వద్ద సముద్రం పది మీటర్లు ముందుకొచ్చినట్లు తెలుస్తోంది.