Tirumala : శనివారం నాడు తిరుమలలో భక్తుల రద్దీ ఎలా ఉందో తెలుసా?
తిరుమలలో నేడు కూడా భక్తుల రద్దీ కొనసాగుతుంది. శనివారం కావడంతో భక్తులు ఎక్కువ సంఖ్యలోనే ఉన్నారు;
తిరుమలలో నేడు కూడా భక్తుల రద్దీ కొనసాగుతుంది. శనివారం కావడంతో భక్తులు ఎక్కువ సంఖ్యలోనే ఉన్నారు. తిరుమల లడ్డూ వివాదం నేపథ్యంలో భక్తులు ఎక్కువ మంది దీనిపైనే చర్చించుకున్నట్లు కనపడింది. లడ్డూలో నాణ్యతపై భక్తుల్లో పెద్దయెత్తున చర్చ జరుగుతుంది. అయితే ఈ వివాదాలను పక్కన పెట్టి శ్రీ వెంకటేశ్వరస్వామిని దర్శించుకోవడానికి భక్తులు బారులు తీరారు. తిరుమలలో వీధులన్నీ భక్తులతో కిటకిటలాడిపోతున్నాయి. తలనీలాలను సమర్పించే చోట కూడా భక్తులు అధిక సంఖ్యలో కనిపిస్తున్నారు. అలాగే అన్నదానానికి శ్రీ తరిగొండ వెంగమాంబ సత్రానికి కూడా భక్తులు అధిక సంఖ్యలో చేరడంతో అందరికీ అందేలా తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
హుండీ ఆదాయం...
ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని పదహారు కంపార్ట్‌మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. ఉచిత దర్శనం క్యూ లైన్ లోకి ఈరోజు టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం పద్దెనిమిది గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు నాలుగు గంటల సమయం పడుతుంది. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం మూడు నుంచి నాలుగు గంటల సమయం పడుతుంది. నిన్న తిరుమల శ్రీవారిని 73,104 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 28,330 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారని అధికారులు వెల్లడించారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.26 కోట్ల రూపాయలు వచ్చిందని అధికారులు తెలిపారు.