BJP : బీజేపీలో నామినేటెడ్ పోస్టుల రగడ.. ఇరవై పోస్టుల్లో ఒక్కటేనా?

ఆంధ్రప్రదేశ్ బీజేపీలో నామినేటెడ్ పదవుల పంపకాల్లో విభేదాలు మొదలయ్యాయి. పురంద్రీశ్వరికి తలనొప్పిగా తయారైంది

Update: 2024-09-24 11:30 GMT

 purandriswari 

ఆంధ్రప్రదేశ్ బీజేపీలో నామినేటెడ్ పదవుల పంపకాల్లో విభేదాలు మొదలయ్యాయి. కూటమి ప్రభుత్వంలో భాగస్వామి కావడంతో నామినేటెడ్ పోస్టుల్లో కొంత భాగం బీజేపీకి ఇవ్వనున్నారు. సింహభాగం టీడీపీ, ఆ తర్వాత జనసేనకు అధిక పోస్టులు దక్కనున్నాయి. తొలి జాబితాలో అదే జరిగింది. చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు భారతీయ జనతా పార్టీకి ఆరు నామినేటెడ్ పోస్టులు ఇచ్చే అవకాశముంది. ఇటీవల బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంద్రీశ్వరి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును కలిశారు. ఈ సందర్భంగా వారి మధ్య నామినేటెడ్ పోస్టుల చర్చకు వచ్చినట్లు తెలిసింది. దుర్గ గుడి ఛైర్మన్ పదవితో పాటు మరికొన్న కీలక పోస్టులను బీజేపీ అడిగినట్లు సమాచారం. ఈరోజు ఇరవై నామినేటెడ్ పోస్టులు భర్తీ చేస్తే అందులో బీజేపీకి ఒకటి మాత్రమే దక్కింది. జనసేనకు మూడు కేటాయించడంతో పాటు టీడీపీ పదహారు తీసుకోవడం పట్ల కూడా కమలం పార్టీ నేతలు కొంత అసహనంగా ఉన్నారు.

ఈ ఇద్దరి పేర్లను...
అయితే పురంద్రీశ్వరి సోము వీర్రాజు, విష్ణువర్థన్ రెడ్డి పేర్లను నామినేటెడ్ పదవులకు సూచించినట్లు కూడా వార్తలు వచ్చాయి. ఈ ఇద్దరు బీజేపీలో సీనియర్ నేతలు కావడంతో పాటు మొన్నటి వరకూ సోము వీర్రాజు రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసి ఉండటం, విష్ణువర్థన్ రెడ్డి పార్టీ ఉపాధ్యక్షుడిగా సేవలందించడంతో వీరిద్దరికీ ఇవ్వాలని చిన్నమ్మ బీజేపీ నాయకత్వం తరుపున చంద్రబాబు చెవిలో ఆ ఇద్దరి పేర్లను వేసినట్లు చెబుతున్నారు. ఇందులో ఒకరు తూర్పు గోదావరి జిల్లాకు చెందిన నేత కాగా, మరొకరు రాయలసీమకు చెందిన నేత కావడంతో ప్రాంతాల వారీగా సమ ప్రాధాన్యత ఇచ్చినట్లవుతుందని భావిస్తున్నారు.
వ్యతిరేకించే వారు...
ఒకరు కాపు సామాజికవర్గం నేత కాగా, మరొకరు రెడ్డి సామాజికవర్గానికి చెందిన వారు. కానీ ఈ ఇద్దరు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరించారన్న పేరుంది. అప్పటి వైసీపీ ప్రభుత్వానికి మద్దతుగా నిలవడమే కాకుండా, టీడీపీ, బీజేపీ పొత్తుకు కూడా కొంత అడ్డం పడ్డారని కూటమిలోని టీడీపీలో కొందరు నేరుగానే అంటున్నారు. ఇక బీజేపీలోనూ వీరిద్దరి పేర్లను వ్యతిరేకించే వారికి కొదవలేదు. అనకాపల్లి పార్లమెంటు సభ్యుడు సీఎం రమేష్ అందరితో చర్చించిన తర్వాతనే నామినేటెడ్ పదవులకు పేర్లను టీడీపీకి సిఫార్సు చేయాలని అనడంతో వారిద్దరికీ నామినేటెడ్ పోస్టుల ఇవ్వడం బీజేపీలోని ఒకవర్గానికి ఇష్టం లేదని స్పష్టమవుతుంది. అందుకే సుజనా చౌదరికి ఇష‌్టమైన టీడీపీ నుంచి బీజేపీలోకి వెళ్లిన లంకా దినకర్ కు ఇచ్చారని పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు.
ఢిల్లీ పెద్దల నుంచి...
అయితే నామినేటెడ్ పోస్టుల దగ్గర నుంచి ప్రతి కీలకమైన నిర్ణయం ఢిల్లీలోని నాయకత్వమే నిర్ణయం తీసుకుంటుంది. ఢిల్లీ పెద్దల మనసులో ఎవరి పేర్లు ఉంటే వారి పేర్లనే సిఫార్సు చేస్తారు తప్పించి రాష్ట్ర నేతల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకునే అవకాశం లేదు. కాకుంటే శంఖంలో పోస్తే తీర్థం అన్న సామెతగా ఢిల్లీలో పేర్లను నిర్ణయించి ఇక్కడ నేతల అభిప్రాయ సేకరణ జరిపినట్లు జరిపించేసి కమలనాధులు మమ అనిపించేస్తారు. మంత్రి పదవి విషయంలోనూ ఊహించని, తొలిసారి ఎన్నికైన సత్యకుమార్ యాదవ్ కు దక్కడంతో పార్టీకి లాయల్ గా ఉండే వారికే నామినేటెడ్ పదవులు ఇచ్చే అవకాశముందంటున్నారు. మొత్తం మీద ఆరు పోస్టులకు బీజేపీలో మాత్రం ఈరోజు నుంచి రగడ మొదలయింది. లంకా దినకర్ కు ఇచ్చిన ప్రభుత్వం మిగిలిన వారి పేర్లను పక్కన పెట్టిందని బీజేపీలో విమర్శలు మొదలయ్యాయి. ఇది పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలికి చికాకు కలిగించేదే. రానున్న కాలంలో మరిన్ని పదవులు బీజేపీకి వస్తాయని పురంద్రీశ్వరి చెబుతున్నట్లు తెలిసింది.


Tags:    

Similar News