Prashanth Kishore : ప్రశాంత్ కిషోర్ జగన్ ను కలుస్తానన్నాడా? అయితే అందుకు జగన్ ఏం సమాధానం ఇచ్చారో తెలుసా?
ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ మరోసారి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారారు
ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ మరోసారి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారారు. ప్రశాంత్ కిషోర్ అంచనాలు ఏపీ ఎన్నికలలో నిజమయ్యాయి. ఆయన అంచనా వేసినట్లుగా అతి తక్కువ స్థానాలతో వైసీీపీ గెలుస్తుందన్న ఆయన జోస్యం నిజమయింది. ఆయన ఏపీలో ఎలాంటి సర్వే చేయకపోయినా, ఆయనకున్న నెట్ వర్క్ ద్వారా సమాచారాన్ని తెప్పించుకుని మాట్లాడారు. అయితే ప్రశాంత్ కిషోర్ ఎన్నికల పోలింగ్ కు ముందు ఒక ప్రయివేటు ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. పోలింగ్ పై ప్రభావం చూపుతుందని వైసీీపీ నేతలు ఆందోళన కూడా చెందారు.
ప్రశాంత్ కిషోర్ చేసిన వ్యాఖ్యలతో...
ప్రశాంత్ కిషోర్ పై వైసీపీ నేతలు విరుచుకుపడ్డారు కూడా. ఏపీలో పరిస్థితులు ఆయనకు ఏం తెలుసునని ప్రశ్నించారు. అంతేకాడు పీకేకు మతిభ్రమించి మాట్లాడుతున్నారంటూ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ వంటి వారు వ్యాఖ్యానించారు. ప్రజలు ఇలాంటి మాటలను పట్టించుకోరని కూడా చెప్పారు. చంద్రబాబు,లోకేష్ లను కలిసిన తర్వాత ఆయన స్వరం మారిందని కూడా అన్నారు. కానీ ఎన్నికల ఫలితాల తర్వాత ప్రశాంత్ కిషోర్ చెప్పిందే నిజమయింది. 2019 ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ వైసీపీకి ఎన్నికల వ్యూహకర్తగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. ఆ ఎన్నికల్లో ఫ్యాన్ పార్టీకి 151 స్థానాలు రావడం కూడా ప్రశాంత్ కిషోర్ వల్లనేనంటూ అప్పట్లో విపక్ష మీడియా ధ్వజమెత్తింది కూడా.
ఫలితాల ముందు కూడా...
అయితే 2019 నుంచి ప్రశాంత్ కిషోర్ వైసీపీకి దూరమయ్యాడు. ఆయన స్థానంలో జగన్ రిషీసింగ్ ను నియమించుకున్నారు. ఐప్యాక్ టీం లో ఉన్న రిషి సింగ్ ను జగన్ చేరదీశారు. అయితే గత ఎన్నికల్లో ఐప్యాక్ టీం పూర్తిగా విఫలమయిందన్న విమర్శలు సొంతపార్టీ నేతల నుంచే వినిపిస్తున్నాయి. ఎన్నికల ఫలితాల ముందు కూడా జగన్ ఐ ప్యాక్ కార్యాలయానికి వెళ్లి టీం ఎన్నికల్లో చేసిన కృషిని ప్రశంసించారు. ఖచ్చితంగా గెలుపు మనదేనంటూ చెప్పారు. దేశం ఆశ్చర్యపోయేలా ఫలితాలు ఉంటాయన్నారు. కానీ చివరకు ప్రశాంత్ కిషోర్ అంచనాలే నిజమయ్యాయి. అయితే ఎన్నికల్లో ఓటమి తర్వాత ఐ ప్యాక్ టీం ను మూసి వేస్తారని భావించారు.
ఐప్యాక్ టీం....
కానీ ఓటమి తర్వాత కూడా ఐప్యాక్ టీం కొనసాగించాలని జగన్ నిర్ణయించారు. సోషల్ మీడియా నిర్వహణ బాధ్యతతో పాటు నియోజకవర్గాల్లో పరిస్థితులను అంచనా వేయడానికి ఐ ప్యాక్ టీం ఉపయోగపడుతుందని, 2029 ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలని జగన్ ఐ ప్యాక్ టీంకు సూచించినట్లు తెలిసింది. మరోవైపు ప్రశాంత్ కిషోర్ జగన్ కలిసేందుకు సమాచారం పంపారు. తాను కలవాలని, కొన్ని కీలకమైన అంశాలు మాట్లాడాలని పీకే చెప్పినట్లు తెలిసింది. అయితే జగన్ అందుకు సున్నితంగా తిరస్కరించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతమున్న ఐప్యాక్ టీంనే కొనసాగించి వచ్చే ఎన్నికల్లో విజయం సాధించాలన్న లక్ష్యంతోనే జగన్ ప్రశాంత్ కిషోర్ కు అపాయింట్‌మెంట్ ఇవ్వలేదంటున్నారు.