Free Gas Cylinder: ఏపీలో ఉచిత గ్యాస్ సిలిండర్ కావాలంటే ఇలా చేయాల్సిందేనట

మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్లను దీపావళి నుంచి పంపిణీ చేయనున్నారు. ఈమేరకు చంద్రబాబు నాయుడు అధికారికంగానే ప్రకటించారు;

Update: 2024-09-30 07:23 GMT
free gas cylinders, distributed,  andhra pradesh, free gas cylinders will be distributed to women in andhra pradesh from diwali, Free Gas Cylinder in AP news today telugu

Free Gas Cylinder in AP

  • whatsapp icon

ఆంధ్రప్రదేశ్ లో మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్లను దీపావళి నుంచి పంపిణీ చేయనున్నారు. ఈమేరకు చంద్రబాబు నాయుడు అధికారికంగానే ప్రకటించారు. అక్టోబరు 31వతేదీన దీపావళి రోజున ఉచిత గ్యాస్ సిలిండర్లను పంపిణీ కార్యక్రమాన్ని చంద్రబాబు ప్రారంభించనున్నారు. సూపర్ సిక్స్ హామీల అమలులో భాగంగా మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లను ఆరోజు నుంచి అమలు చేయనున్నారు. దీంతో మహిళల్లో ఉచిత గ్యాస్ సిలిండర్ పొందడానికి ఎవరెవరు అర్హులు అన్న దానిపై ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో చర్చ జరుగుతుంది. అసలు దీనికి అర్హతలను ప్రభుత్వం ఏం నిర్ణయించింది? విధివిధానాలేంటి? అన్న దానిపై మహిళల్లో హాట్ టాపిక్‌గా మారింది.

మూడు ఉచిత సిలిండర్లు...
నాడు చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ మేరకు ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లను పేదింటి మహిళలకు అందిస్తామని తెలిపారు. అంటే "పేద" అని నిర్ణయించేది ఒకటే ఒక్కటి. అది తెలుపు రంగు రేషన్ కార్డు. తెలుపు కార్డు ఉన్న రేషన్ కార్డు దారులు ఆంధ్రప్రదేశ్ లో దాదాపు 1.30 లక్షల మంది ఉన్నారు. వీరిలో కొన్ని కుటుంబాలకే పథకాన్ని వర్తింప చేస్తారా? లేక అందరికీ మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు సరఫరా చేస్తారా? అన్నది చర్చనీయాంశమైంది. మూడు గ్యాస్ సిలిండర్లు అంటే నలుగురు సభ్యులున్న ఒక కుటుంబానికి ఒక సిలిండర్ నాలుగు నెలలు వచ్చే అవకాశముంది. అంటే మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు అంటే ఏడాది మొత్తం ఫ్రీ సిలిండర్లు పొందే వీలుంది.
తెలుపు రంగు కార్డులను...
కానీ ఏపీలో రేషన్ కార్డుల మంజూరులో గత ప్రభుత్వంలో అవినీతి జరిగిందని ప్రభుత్వం భావిస్తుంది. అందుకే రేషన్ కార్డుల ఏరివేత కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఎక్కువగా తెలుపు రంగు రేషన్ కార్డులను వైసీపీ పార్టీకి చెందిన వారికి ఇచ్చారని టీడీపీ స్థానిక నేతల నుంచి ఫిర్యాదులు అందడంతో కూటమి ప్రభుత్వం దానిపై దృష్టి సారించింది. రేషన్ కార్డులు వల్ల అనేక ప్రభుత్వ పథకాలను ఐదేళ్ల పాటు పొందారని కూడా వారు చెప్పడంతో దీంతో పింఛన్లపై కూడా దర్యాప్తు చేపట్టింది. రేషన్ కార్డులు తెలుపు రంగు ఏ ప్రాతిపదికన ఇచ్చారన్న దానిపై దర్యాప్తు ప్రారంభమయింది. అనర్హులకు తెలుపు రంగు కార్డులు తొలగిస్తారని తెలిసింది.
కేవైసీ లింక్ చూసుకుని...
అదే సమయంలో తమ ఆధార్ కార్డుతో గ్యాస్ కంపెనీ వద్దకు వెళ్లి లింక్ చేసుకోవాలని, కేవైసీ నమోదు చేసుకోవాలని కూడా నిబంధన వచ్చే అవకాశముంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే అనేక మంది గ్యాస్ కంపెనీల వద్దకు వెళ్లి కేవైసీ నమోదు చేయించుకున్నారు. తెలంగాణ, కర్ణాటకల్లోనూ ఉచిత గ్యాస్ కాదు కానీ ఐదు వందల రూపాయలకే సిలిండర్ ఇస్తున్నందున అక్కడ విధివిధానాలను అధికారులు అధ్యయనం చేసి వచ్చారు. ఈ నివేదిక కూడా ప్రభుత్వానికి అందినట్లు తెలిసింది. తెలుపు రంగు రేషన్ కార్డులను తొలగించిన తర్వాత మాత్రమే మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు వారికి వర్తింప చేస్తారన్న టాక్ వినపడుతుంది. అయితే ప్రభుత్వం మాత్రం అధికారికంగా విధివిధానాలను త్వరలోనే ప్రకటించాల్సి ఉంది.


Tags:    

Similar News