Free Gas Cylender : ఏపీలో ఉచిత గ్యాస్ సిలిండర్ అందుకున్నది ఎంతమందో తెలుసా?
ఆంధ్రప్రదేశ్ లో మహిళలకు ప్రభుత్వం ఉచిత గ్యాస్ సిలిండర్ పథకాన్ని ప్రారంభించింది. దీనికి అనూహ్య స్పందన లభించింది
ఆంధ్రప్రదేశ్ లో మహిళలకు ప్రభుత్వం ఉచిత గ్యాస్ సిలిండర్ పథకాన్ని ప్రారంభించింది. దీనికి అనూహ్య స్పందన లభించింది. దీపావళి పండగ రోజు ఈ పథకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. కేవలం నెల పది రోజుల్లోనే రాష్ట్ర వ్యాప్తంగా 80.37 లక్షల సిలిండర్లు బుక్ అయ్యాయి. ఇందులో 62.30 లక్షల సిలిండర్లు డెలివరీ అయ్యాయి. ఇప్పటి వరకూ గ్యాస్ సిలిండర్ కు సంబంధించి 463.81 కోట్ల రూపాయలు లబ్దిదారుల ఖాతాల్లో జమ అయింది.ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్ లను ఇస్తామని సూపర్ సిక్స్ హామీల అమలులో భాగంగా గత నవంబరు నెలలో ఈ పథకాన్ని ప్రారంభించిన నాటి నుంచి మహిళలు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు.
మొత్తం 1.55 కోట్ల మందికి...
దీపం 2 పథకం కింద ఈ ఉచిత గ్యాస్ సిలిండర్లను మహిళలకు అందచేస్తున్నారు. పొరుగున ఉన్న తెలంగాణలో ఐదు వందల రూపాయలకు గ్యాస్ సిలిండర్ ఇస్తుండగా దేశంలో ఎక్కడా లేని విధంగా ఉచితంగా ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తుండటం నిజంగా హ్యాపీ గా ఫీలవుతున్నారనే చెప్పాలి. ఆంధ్రప్రదేశ్ లో ఉన్న 1.55 కోట్ల మంది లబ్దిదారులకు ఈ పథకం వర్తిస్తుంది. ఇందుకోసం ప్రభుత్వం 2,684 కోట్ల రూపాయల నిధులను ప్రభుత్వం ముందుగానే విడుదల చేసింది. అయితే తొలివిడత గ్యాస్ బుక్ చేసుకున్న వారు తొలుత నగదును చెల్లిస్తే తర్వాత లబ్దిదారుల ఖాతాల్లో ప్రభుత్వం నేరుగా ఆ సిలిండర్ సొమ్మును జమ చేస్తుంది. అయితే వచ్చే విడత నుంచి ముందుగానే అంటే సిలిండర్ ను బుక్ చేసుకున్న వెంటనే నగదు పడేలా చర్యలు తీసుకునేలా ప్రభుత్వం తీసుకుంటుంది.
నాలుగు నెలలకు ఒకసారి...
ఏడాదికి మూడు విడతలుగా ఈ దీపం 2 పథకాన్ని వర్తింప చేస్తున్నారు. తొలి సిలిండర్ బుక్ చేసుకోవడానికి అక్టోబరు 29వ తేదీ నుంచి వచ్చే ఏడాది మార్చి 31వ తేదీ వరకూ బుక్ చేసుకునే వీలుంది. అయితే తెలుపు రంగు రేషన్ కార్డు ఉన్న వారికి మాత్రమే ఈ పథకం వర్తింపచేసేలా ప్రభుత్వం అర్హతలు నిర్ణయించింది. ప్రతి ఏడాది ఏప్రిల్ - జూలై 1వ తేదీ నుంచి ఆగష్టు –నవంబర్ ఒకటో తేదీ వరకూ రెండో సిలిండర్ , డిసెంబర్ –మార్చి ఒకటో తేదీ మధ్య మూడో సిలెండర్ బుక్ చేసుకోవచ్చు. అయితే ఈ తేదీలతో సంబంధం లేకుండా నాలుగు నెలలకు ఒకసారి బుక్ చేసుకునే అవకాశం కల్పించారు. తెలుపురంగు రేషన్ కార్డు, ఎల్.పి.జి కనెక్షన్ కలిగి ఉండటంతో పాటు ఆధార్ కార్డు ఉండాలి. ఆధార్ కార్డుతో రేషన్ కార్డు అనుసంధానం అయి ఉండాలి. ఎవరైనా ఉచిత సిలిండర్ అందకుంటే 1967 టోల్ ఫ్రీ నెంబరుకు ఫోన్ చేసి సమాచారాన్ని పొందవచ్చు.