Rain Alert : నేడు ఏపీలో వర్షాలు పడే ప్రాంతాలివేనట.. అలెర్ట్
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడిందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడిందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల్లో భారీ వర్షం కురిసే ఛాన్స్ ఉందని తెలిపింది. అల్పపీడనం రానున్న ఇరవై నాలుగు గంటల్లో మరింత బలపడి శ్రీలంక - తమిళనాడు తీరాన్ని తాకే అవకాశముందని తెలిపింది. నైరుతి, దానిని ఆనుకుని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతం మీద తీవ్ర అల్పపీడనం గా ఏర్పడే అవకాశముందని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. అయతే ఈ తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా మారుతుందా? లేదా మరింత బలహీన పడుతుందా? అన్న దానిపై మాత్రం స్పష్టత రాలేదు. వాతావరణ శాఖ కూడా ఇంకా చెప్పలేదు.
ఈరోజు నుంచి...
అల్పపీడనం ప్రభావంతో ఈరోజు నుంచి భారీ వర్షాలు పడతాయని తెలిపింది. ప్రధానంగా కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో వర్షాలు పడే అవకాశముందని చెప్పింది. అల్పపీడనం ప్రభావంతో నేటి నుంచి మూడు రోజుల పాటు భారీ వర్షాలు పడతాయి. ప్రధానంగా తమిళనాడులోనూ ఎక్కువ స్థాయిలో వర్షాలు కురుస్తాయని తెలిపింది. అలాగే ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. మరోవైపు నేడు తమిళనాడు - శ్రీలంక మధ్య తీరం దాటే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ తెలిపింది.
రైతుల కోసం...
అయితే మూడు రోజులు భారీ వర్షాలు పడుతుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే మొన్న కురిసిన వర్షాలకు పంట తడిసిపోయి తీవ్ర నష్టం వాటిల్లింది. అయితే ఇరవై శాత పంట తడిసినా తాము కొనుగోలు చేయడానికి సిద్ధమని మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. రైతులందరికీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ధాన్యం దాచుకోవడానికి టార్పాలిన్ లు పంపిణీ చేయాలని కూడా నిర్ణయించింది. అయితే రైతులు ముందు జాగ్రత్త చర్యగా తమ పంట ఉత్పత్తులు కాపాడుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. అలాగే తీర ప్రాంత ప్రజలు కూడా నిరంతరం అప్రమత్తంగా ఉండి వాతావరణ శాఖ జారీ చేస్తున్న సూచనలను గమనిస్తుండాలని పేర్కొన్నారు. మొత్తం మీద రానున్న మూడు రోజుల పాటు ఏపీలో భారీ వర్షాలు కురియనున్నాయి.