Ys Jagan : ఓటమి తర్వాత రాళ్లు పడతాయ్.. పూలు పడవు.. అన్నింటినీ దాటుకుని వెళితేనే?

ఆంధ్రప్రదేశ్ లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఓటమి పాలయింది. ఈ ఓటమికి అనేక కారణాలు వినిపిస్తున్నాయి

Update: 2024-06-25 06:05 GMT

ఆంధ్రప్రదేశ్ లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఓటమి పాలయింది. ఈ ఓటమికి అనేక కారణాలు వినిపిస్తున్నాయి. నేతలు కూడా అనేక రీజన్స్ చెబుతున్నారు. గెలిచినప్పుడు గెంతులు వేయడం.. ఓటమి చెందినప్పుడు గేలి చేయడం పరిపాటి. ఓటమి ఎదురయినప్పుడు ఏ నేతకయినా.. అందులోనూ ప్రాంతీయపార్టీల నేతలకు రాళ్లు పడక తప్పవు. అది ఎవరైనా సరే. చంద్రబాబు కూడా 2019 ఎన్నికల్లో ఓటమి పాలయినప్పుడు ఇదే తరహా బాధను అనుభవించారు. 2023లో తెలంగాణలో కేసీఆర్ ఇప్పుడు కూడా ఓటమి బాధ నుంచి తేరుకోలేకపోతున్నారు. విమర్శలను ఎదుర్కొంటున్నారు. అధికారంలో ఉన్నప్పుడు ఆహా, ఓహో అని పొగిడిన నేతలు, మీడియా సయితం ఓటమి తర్వాత రంధ్రాన్వేషణ చేయడం ఏ నేత విషయంలోనూ జరుగుతుంది. ఇందులో జగన్ ఒక్కరూ మినహాయింపు కాదు.

ఎవరైకైనా తప్పదంతే...
ఒడిశా ముఖ్యమంత్రిగా ఇరవై ఐదేళ్ల పాటు సుదీర్ఘకాలం పనిచేసిన నవీన్ పట్నాయక్ కు ఓటమి తప్పలేదు. ఆయన ఓటమిని చాలా తేలిగ్గా తీసుకున్నారు. బీజేపీ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి హాజరయ్యారు. చివరకు అసెంబ్లీ ఎన్నికల్లో ఒక నియోజకవర్గంలో తనను ఓడించిన బీజేపీ నేతను కూడా ఆప్యాయంగా పలకరించి నవీన్ పట్నాయక్ ప్రత్యేకతను చాటు కున్నారు. ఆయన వయసుకు, అనుభవానికి అది సరిపోయింది. కానీ ఏపీ, తెలంగాణలలో రాజకీయ పరిస్థితులు అలా లేవు. అందుకే ఈరెండు రాష్ట్రాల నేతల నుంచి అలాంటి వ్యవహారశైలిని కోరుకోవడం తప్పే అవుతుంది. అయినా జగన్ ఓటమి నుంచి వెంటనే తేరుకున్నట్లే కనిపిస్తుంది. ఓటమి తర్వాత అందరిలాగానే ఈవీఎంలపై నెపం మోపే ప్రయత్నం చేసినా అసలు కారణాలు ఏంటో ఆయనకు ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది.
దూరం అయిన వారిని...
తాను ఎవరిని ఐదేళ్లలో దూరం చేసుకున్నారో ఆయనకు పక్షం రోజుల్లోనే అర్థమయింది. సొంత సామాజికవర్గం నేతలను దూరం చేసుకుని తాను ఎంత నష్టపోయిందీ తెలుసుకున్నారు. పులివెందుల నియోజకవర్గంలోనే తీసుకుంటే.. అక్కడ కాంట్రాక్టర్లకు వంద కోట్ల రూపాయల బిల్లులు పెండింగ్ లో ఉన్న విషయం నిన్నటి పర్యటనలో ఆయనకు తెలిసిందంటే ఎంత వెనక బడి ఉన్నారో ఆయనకే తెలిసిపోయింది. తన దృష్టిికి ఎందుకు తీసుకురాలేదని నేతలయిన కాంట్రాక్టర్లను జగన్ ప్రశ్నించినా అసలు కారణం తనకు తెలియక కాదు. తనను కలిసే అవకాశం వారికి లేదు. వారు కలిసే వాళ్లు తన దృష్టికి తారన్నది స్పష్టమయింది. అందుకే రానున్న కాలంలో ఈ సమస్య నుంచి బయటపడటానికి పెద్ద సమయం పట్టకపోవచ్చు. దూరమైన వర్గం దగ్గర చేసుకోవడం అంత సులువు కాకపోయినా.. కష్టమేమీ కాదన్నది జగన్ విశ్వాసంగా కనపడుతుంది. అందుకే ఆయన రెడ్డి సామాజికవర్గం నేతలతో ప్రత్యేకంగా సమావేశమవ్వాలని నిర్ణయించుకున్నారట.
రెండు ఎన్నికల్లో ఓటమి మధ్య...
దీంతోపాటు ప్రజలతో కనెక్షన్ లేకపోవడం కూడా ఓటమికి కారణంగా గుర్తించారు. ప్రజలు కోరుకునేది మనం చేయాలి తప్పించి.. నివేదికల ద్వారా అందిన వాటిని పరిగణనలోకి తీసుకోకూడదని అర్థమయింది. తనను ఎవరు తప్పుదోవ పట్టించిందీ ఓటమి తర్వాత కానీ జగన్ కు తెలియదు. 2014 ఎన్నికల్లో ఓటమి వేరు. 2024 ఎన్నికల్లో ఓటమి వేరు. ఈ రెండింటి మధ్య తేడాను జగన్ కు స్పష్టంగా తెలుసు. జనంలో నలుగుతున్న సమస్యలు తన దృష్టికి తీసుకురాకపోవడం కొందరు కోటరీలోని వ్యక్తుల కారణమే అయినా.. అందుకు ప్రధాన కారణం తానేనని జగన్ గుర్తించారని అనుకోవాలి. అందుకే ఆయన జనం బాట పట్టాలని నిర్ణయించుకున్నారు. ప్రజలకు సంక్షేమ పథకాలు ఇవ్వడం వల్లనే నలభై శాతం ఓట్లు వచ్చాయి. సోలోగా పోటీ చేసినా అన్ని ఓట్లు వచ్చాయంటే జనాదరణ తనకు ఉందన్న నమ్మకంతో జగన్ ముందుకు సాగాలని నిర్ణయించుకున్నారు. జరిగిన తప్పొప్పులను తెలుసుకుని ముందుకు వెళ్లే ప్రయత్నం మొదలుపెట్టారు. అదీ పులివెందుల నుంచే. మరి రానున్న కాలంలో జగన్ నుంచి ఎలాంటి మార్పు చూస్తామన్నది వేచి చూడాల్సిందే.


Tags:    

Similar News