విజయనగరం జిల్లా.. పాడుబడిన ఇంటిని కూల్చారు.. అక్కడేమో..!
విజయనగరం జిల్లా.. పాడుబడిన ఇంటిని కూల్చారు.. అక్కడేమో
విజయనగరం జిల్లాలోని రాజాం టౌన్‌లోని కంచర స్ట్రీట్‌లో ఓ పాడుబడిన ఇంటిని కూలుస్తున్నారు. అయితే ఒక్కసారిగా గోడ నుంచి బరువైన పెద్ద బీరువా లాకర్ బయటపడింది. పురాతన లాకర్ అంటే చాలు.. అప్పట్లో బాగా సంపాదించేసి అందులో దాచేసుకుని ఉంటారని ప్రతి ఒక్కరూ అనుకుంటారు. అందుకు తగ్గట్టుగానే పనులు చేపట్టిన కూలీలు కూడా అనుకున్నారు. తమ లైఫ్ లో టర్నింగ్ పాయింట్ రాబోతోందని భావించేశారు.
కూలీలు అందులో గుప్త నిధి ఉన్నట్లు భావించారు. ఆ సంపదను కాజేయాలని భావించి.. ఆ లాకర్ బాక్స్ గురించి ఇంటి ఓనర్‌కు సమాచారం ఇవ్వకుండా రహస్యంగా ఉంచారు. అయితే ఎలాగోలా యజమానికి సమాచారం అందింది. దీంతో అతడు కూలీలను నిలదీశాడు. బాక్స్ తమదే అంటూ అటు ఓనర్‌తో పాటు కూలీలు గొడవకు దిగారు. దాని లోపల భారీగా గుప్త నిధి ఉన్నట్లు ప్రచారం జరిగి.. చివరికి అధికారులకు సమాచారం వెళ్ళింది. ఇంకేముంది రెవిన్యూ అధికారులు, పోలీసులు అక్కడికి వచ్చేశారు. ఆ లాకర్ ఓపెన్ చేసేందుకు ప్రయత్నించారు. దాన్ని తెరిచేందుకు నానా అవస్థలు పడ్డారు. నాలుగు గంటలు శ్రమించినా ఓపెన్ కాకపోవడంతో.. గ్యాస్ కట్టర్ల సాయంతో ఓపెన్ చేశారు. అన్ని గంటల సస్పెన్స్ తర్వాత లాకర్ ఓపెన్ అవ్వగా.. అందులో పలు కాగితాలతో పాటు నాలుగు పురాతన నాణేలు మాత్రమే ఉన్నాయి. బంగారు నిధి లాంటిదేమీ లేకపోవడంతో అందరూ బాగా అప్సెట్ అయ్యారు.