Janasena Party : ఎదుటి వాడికి చెప్పేటందుకే నీతులు ఉన్నాయా? సామీ
జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ దారిలోనే నేతలు కూడా పయనిస్తున్నట్లు కనపడుతుంది;

యధా రాజా తథా ప్రజా అనేది నానుడి. అలాగే నాయకుడు ఎలా ఉంటే కిందిస్థాయి నేతలు కూడా అలాగే ఉంటారు. యధా రాజా.. తథా క్యాడర్ అని అనుకోవచ్చు. ఉప ముఖ్యమంత్రిగా పవన్ కల్యాణ్ తరచూ అనే మాట తోలు తీసి కింద కూర్చోబెడతా.. అయితే ఈ కామెంట్స్ వైసీపీ నేతలను ఉద్దేశించి చేసినవి. కడప జిల్లాలో ఎంపీడీవో పై వైసీపీ నేత ఒకరు దాడి చేయడంతో ఆయనను పరామర్శించడానికి కడపకు వెళ్లిన పవన్ కల్యాణ్ ఈరకమైన వార్నింగ్ ఇచ్చారు. అధికారంలో లేకపోయినా, పదకొండు సీట్లు వచ్చినా ఇంకా పొగరు తగ్గలేదని, దానిని అణిచివేస్తామని కూడా పవన్ హెచ్చరించారు. అధికారుల జోలికి వస్తే ఊరుకునేది లేదని, తాము అండగా ఉంటామని ఆయన హెచ్చరించి వచ్చేశారు.
వార్నింగ్ ఇవ్వడంతో...
అయితే తోలుతీస్తా.. అనే పదం పార్టీలో పాపులర్ అయినట్లుంది. జనసేన నేతలు కూడా దాని పట్టుకుని అధికారులకు వార్నింగ్ ఇవ్వడం మొదలు పెట్టారు. విజయవాడ రూరల్ మండలం ఎనికేపాడు పంచాయతీ కార్యదర్శిపై చిందులు తొక్కారు. "ఒరేయ్ ఈవో తోలుతీస్తా.. జాబ్ తీయిస్తా.. నువ్వెంత? నీ బతుకెంత?నువ్వు మాకు పాలేరువి" అంటూ జనసేననేత చలమలశెట్టి రమేష్ పంచాయతీ కార్యదర్శిపై ఆగ్రహం వ్యక్తంచేశారు. నోటికొచ్చినట్లు మాట్లాడారు. వంగవీటి రంగా, మహాత్మాగాంధీ విగ్రహాల ఆవిష్కరణ సందర్భంగా చోటు చేసుకున్నసంఘటన ఇది. జనసేన నేత చలమలశెట్టి సురేష్ వార్నింగ్ ఇవ్వడం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
సోషల్ మీడియాలో ప్రశ్నలు...
అదే ఇప్పుడు పవన్ కల్యాణ్ ప్రశ్నిస్తున్నారు. మీరు తోలు తీస్తానని వైసీపీ నేతలకు హెచ్చరికలు జారీ చేసి వస్తే నియోజకవర్గాల్లో జనసేన నేతలు అధికారులు అదే రకమైన వార్నింగ్ ఇస్తున్నారంటూ కామెంట్స్ పెడుతున్నారు. పంచాయతీ రాజ్ కార్యదర్శిపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన జనసేన నేత పై ఆ పార్టీ అధినాయకత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందా? లేదా? అన్నది పక్కన పెడితే మరి పంచాయతీ కార్యదర్శికి ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పరామర్శిస్తారా? లేదా? కనీసం ఫోన్ చేసైనా ఆయనకు ధైర్యం చెబుతారా? అన్న కామెంట్స్ మాత్రం బాగా వినపడుతున్నాయి. అందుకే ఎదుటి వాడికి చెప్పేటందుకు నీతులు ఉన్నాయంటూ కూడా ఒక పాటను పోస్ట్ చేశారు.