Pawan Kalyan : పవన్ పట్టుదలకు పోతే నష్టమే.. పట్టువిడుపులుండాలనేనా?
జనసేన అధినేత పవన్ కల్యాణ్ సుదీర్ఘ కల నెరవేరింది. అయితే ఆయన దూకుడు ఇబ్బందికరంగా మారింది
జనసేన అధినేత పవన్ కల్యాణ్ సుదీర్ఘ కల నెరవేరింది. ఆయన అనుకున్నది అనుకున్నట్లుగానే ఈ ఎన్నికల ఫలితాలు ప్రతిబింబించాయి. త్యాగాలకు సిద్ధమయి వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించడమే తన ధ్యేయమని చెప్పిన పవన్ కల్యాణ్ అన్న మాట ప్రకారం నిలబెట్టుకున్నారు. సీట్లు చూడలేదు. కేంద్రంలో మంత్రి పదవులు ఆశించలేదు. రాష్ట్రంలో మంత్రి పదవులు ఇన్ని ఇచ్చారన్న అసంతృప్తి ఎంత మాత్రం లేదు. ప్రజలకు ఏదో చేయాలన్న తపనతోనే పవన్ కల్యాణ్ రాజకీయాల్లోకి వచ్చారని ఆయన సన్నిహితులు కూడా చెబుతున్నారు. దీంతోపాటు ఈ ఎన్నికల్లో నెగ్గడానికి తనకంటూ ఒక వ్యూహం ఉందని చెప్పిన పవన్ కల్యాణ్ అంతా తన వ్యూహం ప్రకారమే ముందుకు వెళ్లారు. ఎన్ని సీట్లు తీసుకున్నామన్నది కాదని, ఎన్ని గెలిచామన్న ఆయన మాటను నిజం చేస్తూ స్ట్రయికింగ్ రేటు వంద శాతం వచ్చింది.
కూటమి విజయంలో...
మొన్నటి ఎన్నికల్లో జనసేన 21 స్థానాల్లో బరిలోకి దిగి అన్నింటిలో విజయం సాధించడంలో పవన్ కల్యాణ్ పాత్రను ఎవరూ కాదనలేరు. కూటమి విజయంలో ఆయన పోషించిన భూమికను కూడా ఎవరూ తోసిపుచ్చలేరు. ఎందుకంటే ఎన్ని విమర్శలు వచ్చినా.. ఎన్ని ట్రోలింగ్ లు ఎదురయినా సరే పవన్ కల్యాణ్ మాత్రం అదరలేదు. బెదరలేదు. లక్ష్యం వైపు చూశారు. దానినే గురి చూసి కొట్టగలిగారు. సరే ఉప ముఖ్యమంత్రి పదవి వచ్చిందని సంతోషపడాలా? లేదా? అన్నది పక్కన పెడితే ఆయన అసలు టార్గెట్ మాత్రం రీచ్ అయినట్లే అని అనుకోవాలి. ఎందుకంటే ఆయన పార్టీని పదేళ్ల నుంచి కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తున్నారు. ఎందరో పార్టీని వీడిపోయినా లెక్క చేయలేదు. వెళ్లిన వాళ్లు వెళతారు.. ఉన్నవాళ్లు ఉంటారు అన్న తరహాలోనే ఆయన తన రాజకీయాన్ని కొనసాగించారు తప్పించి నేతలు వెళ్లి పోయారన్న దిగులు చెందలేదు.
ఆవేశంగా మాట్లాడితే...
అయితే పవన్ కల్యాణ‌్ ఆవేశ పరుడు. ఇది అందరూ ఒప్పుకోవాల్సిన నిజం. ఎందుకంటే ఆయనకు ప్రేమ వచ్చినా.. ద్వేషం వచ్చినా మనసులో దాచుకోలేరు. అలాంటి మనస్తత్వం కాదు. ఏదైనా బయటకు ఉన్నది ఉన్నట్లు కక్కేసే వ్యక్తిత్వం ఉన్న నేత కావడంతోనే ఆయనను ప్రేమించే వాళ్లు భయపడుతున్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం ఏర్పడింది. చంద్రబాబు నాయుడుతో పాటు మరో 24 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. కానీ భవిష్యత్ లో ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు ఎలా ఉంటాయో ముందే ఊహిచలేం. ఎందుకంటే... చంద్రబాబు నాయుడుకు రాష్ట్ర ప్రయోజనాలు ఎంత ముఖ్యమో.. అదే సమయంలో పార్టీ పదికాలాల పాటు ఉండాలన్న ఉద్దేశ్యం కూడా అంతే స్థాయిలో ఉంటుంది. ఈ పరిస్థితుల్లో కొన్ని నిర్ణయాలు పవన్ మనసును నొప్పించినా ఆయన బయటపడకుండా ఇంటర్నల్ మీటింగ్ లలోనే పరిష్కరించుకోవాలన్న సూచనలు వెలువడుతున్నాయి.
కూటమి ప్రభుత్వంలో...
ఎందుకంటే కూటమి ప్రభుత్వంలో నిర్ణయాలు సమిష్టిగా జరగాల్సి ఉన్నప్పటికీ, కొన్ని నిర్ణయాలు రాజకీయపరమైనవి ఉంటాయి. వాటిని చంద్రబాబు తప్పనిసరి పరిస్థితుల్లో తీసుకోవాల్సి ఉంటుంది. తన పార్టీ భవిష్యత్ ను దృష్టిలో పెట్టుకుని తీసుకునే నిర్ణయాలను పవన్ విభేదించవచ్చు. అభ్యంతరాలు తెలియజేయవచ్చు. అయితే అది నాలుగు గోడల మధ్యనే జరగాలి తప్పించి బయటకు వస్తే కూటమి నవ్వుల పాలవుతుందన్న కామెంట్స్ వినపడుతున్నాయి. చంద్రబాబు నాయుడు అనుభవం ఉన్న నేత కాబట్టి ఆచితూచి నిర్ణయం తీసుకుంటారు. అందులో ఎలాంటి సందేహం లేదు. ఏదైనా ఒత్తిడికి లోనై నిర్ణయం తీసుకున్నా ఆయనను మెప్పించి ఆ నిర్ణయాన్ని వెనక్కు తీసుకునేలా చూడాలి తప్పించి నేరుగా ఫైర్ అవ్వకూడదన్నది ఆయన అభిమానులు ఆశిస్తున్నారు. ఆయన మనసెరిగిన వారు చెబుతున్నదిదే. అందుకే కొన్ని విషయాలు చూసీ చూడనట్లు వదిలేస్తేనే రాజకీయంగా ఎదుగుతారు. పట్టుకుని లాగితే అసలుకే నష‌్టం వస్తుందన్న విషయాన్ని కూడా పవన్ కల్యాణ్ గుర్తిస్తే మంచిదని ఆయన హితులు చెబుతున్నారు.