వైసీపీ గడప కూల్చేదాకా వదలను
రోడ్లు విస్తరణ పేరుతో ఇప్పటంలో విచక్షణారహితంగా ఇళ్లను కూల్చివేశారని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు;
రోడ్లు విస్తరణ పేరుతో ఇప్పటంలో విచక్షణారహితంగా ఇళ్లను కూల్చివేశారని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. వైసీపీ గడప కూల్చే దాకా వదిలిపెట్టమని ఆయన తెలిపారు. తనకు అండగా ఉన్న ఇప్పటం గ్రామ ప్రజలకు తాను అండగా ఉంటానని ఆయన అన్నారు. ఇప్పటంలో ఇళ్లు కూల్చివేసిన వారికి పవన్ కల్యాణ్ పరిహారం అందించారు. కేవలం కక్షతోనే ఈ ఇళ్లను కూల్చివేశారని పవన్ అన్నారు. ఓట్లు వచ్చే ఎన్నికల్లో వేసినా వేయకపోయినా తాను అండగా నిలబడతానని పవన్ కల్యాణ్ అన్నారు. తాను కడుపు మండి రాజకీయాలలోకి వచ్చానని అన్నారు. అధిక సంఖ్యాకులు అందలం ఎక్కాలన్నదే తన కోరిక అని ఆయన అన్నారు.
అమరావతి రైతులు...
తాను చేసిన ఈ సాయం అద్భుతమని తాను చెప్పడం లేదన్నారు. ఇప్పటం గ్రామ ప్రజలు చూపిన ధైర్యాన్ని అమరావతి ప్రజలు చూపి ఉంటే రాజధానికి ఈ గతి పట్టేంది కాదని ఆయన అన్నారు. రైతులు తెగువ చూపించి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదన్నారు. కూల్చివేతలో పద్ధతి పాటించలేదన్నారు. ఇప్పటం గ్రామానికి ప్రభుత్వం కొట్టిన దెబ్బకు మందు జనసేన రాస్తుందన్నారు. ముప్పయి సంవత్సరాలు ప్రజలు బాగుండాలని తాను కోరుకుంటున్నానని అన్నారు. బెదిరిస్తే ఎవరూ బెదరని అని అన్నారు.
సజ్జల డిఫాక్టో సీఎం...
కనిపించని ముఖ్యమంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి ఇప్పటం గ్రామ కూల్చివేతల వెనక ఉన్నారని పవన్ కల్యాణ‌్ ఆరోపించారు. ఆధిపత్య అహంకారంతో వ్యవహరిస్తున్నారన్నారు. 2024లో అధికారంలోకి రాగానే లీగల్ గానే వైసీపీ నేతల ఇళ్లను కూల్చివేస్తామని పవన్ కల్యాణ్ హెచ్చరించారు. సజ్జల డిఫాక్టో ముఖ్యమంత్రి అని పవన్ ఆరోపించారు. వైసీపీ వ్యక్తుల వద్ద సంస్కారం, మంచి మర్యాద పనిచేయదన్నారు. తమ పార్టీని రౌడీసేన అని అంటున్నారని, వైఎస్ వివేకానందరెడ్డిని హత్య చేసిన వారిని వెనకేసుకొచ్చిన వారా? తమపై ఆరోపణలు చేసేది అని పవన్ ప్రశ్నించారు. తమది రౌడీ సేన కాదని, విప్లవసేన అని పవన్ కల్యాణ్ అన్నారు. వైసీపీ ఉగ్రవాదుల సంస్థ అని ఆరోపించారు.