జనసేన అధినేత వారాహి యాత్ర ఎప్పటి నుండి అంటే?
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నాలుగో విడత వారాహి యాత్రకు సిద్ధమవుతున్నారు
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నాలుగో విడత వారాహి యాత్రకు సిద్ధమవుతున్నారు. సెప్టెంబర్ 21 నుంచి నాలుగో విడత వారాహి యాత్ర ప్రారంభమవుతుందని తెలుస్తోంది. టీడీపీతో కలిసి పోటీ చేస్తామని పవన్ కళ్యాణ్ ప్రకటించిన తర్వాత మొదలుకాబోతున్న యాత్ర కావడంతో టీడీపీ కూడా వారాహి యాత్రకు మద్దతు తెలిపే అవకాశం ఉంది. ఈ నెల 21 నుంచి కృష్ణా జిల్లాలో నాలుగో విడత వారాహి యాత్ర చేపట్టనున్నట్లు స్పష్టం చేశారు. 4 నియోజకవర్గాల్లో 5 రోజుల పాటు వారాహి యాత్ర సాగనుంది. ఇందుకు సంబంధించిన షెడ్యూల్ సైతం ఖరారు అయింది. అవనిగడ్డ, పెడన, మచిలీపట్నం, కైకలూరులో పవన్ వారాహియాత్ర నిర్వహించనున్నారు.
వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వకుండా కలిసొచ్చే పార్టీలతో కలిసి వెళ్లేందుకు సిద్ధమని ప్రకటించిన పవన్ కళ్యాణ్.. ఇటీవల చంద్రబాబును పరామర్శించిన తర్వాత జనసేన, టీడీపీ కలిసి పోటీ చేస్తాయని చెప్పేసారు. టీడీపీ, జనసేన వచ్చే ఎన్నికల్లో కలిసే పోటీకి వెళతాయని ప్రకటించటంతో ఏపీ రాజకీయం మరింత హీటెక్కింది. ఈ ప్రకటన తరువాత పవన్ వారాహి యాత్ర మరింత ప్రాధాన్యత సంతరించుకుంది.