TDP : టీడీపీలో సీనియర్ల లేని లోటు కనపడుతుందా?

తెలుగుదేశం పార్టీలో సీనియర్ నేతలు యాక్టివ్ గా లేని లోటు స్పష్టంగా కనిపిస్తుంది;

Update: 2025-03-25 08:36 GMT
telugu desam party,  active, senior leaders, ap politics
  • whatsapp icon

తెలుగుదేశం పార్టీలో సీనియర్ నేతలు యాక్టివ్ గా లేని లోటు స్పష్టంగా కనిపిస్తుంది. అధికారంలో లేనప్పుడే నయం. అప్పటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళమెత్తిన సీనియర్ నేతలు గత ఎన్నికల్లో టిక్కెట్లు రాక కొందరు, మంత్రి పదవులు దక్కక మరికొందరు మూగవోయారు. అందరూ జూనియర్ నేతలు కావడంతో ప్రతిపక్షం నుంచి వచ్చే విమర్శలకు సరిగా కౌంటర్ ఇవ్వలేకపోతున్నారు. కొందరు తమకేం పట్టిందని వ్యవహరిస్తుండగా, మరికొందరు ఏం మాట్లాడితే ఏం జరుగుతందోనన్న భయంతో జూనియర్ నేతలు గళం విప్పడం లేదు. దీంతో టీడీపీ నేతల నుంచి గట్టి కౌంటర్ ఇవ్వడం లేదన్న విమర్శలు ఆ పార్టీ క్యాడర్ నుంచే వినిపిస్తుండటం విశేషం.

ఆ స్పృహ ఏదీ?
రాజకీయాల్లో అనుభవం చాలా ముఖ్యం. ఎవరికి ఏ రకమైన సమాధానం చెప్పాలన్నది డక్కీమొక్కీలు తిన్న నేతలకు మాత్రమే తెలుస్తుంది. కొత్తగా తొలిసారి ఎన్నికయిన వారిలో కొందరు మినహాయించి మిగిలిన వారిలో పార్టీ తరుపున కౌంటర్ ఇవ్వాలన్న స్పృహ కూడా లేదని టీడీపీ సోషల్ మీడియాలో సొంత క్యాడర్ నుంచి విమర్శలువినిపిస్తున్నాయి. ఉండటానికి ఇరవై మందికిపైగా మంత్రులున్నప్పటికీ ఘాటుగా రిప్లై ఇచ్చేవారు ఒకరిద్దరు మినహాయించి ఎవరూ మాట్లాడటం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఉదాహరణకు చిలకలూరిపేటమాజీ ఎమ్మెల్యే విడదల రజనీపై కేసు నమోదు చేసిన సంఘటనపై ఆమె అనేక ఆరోపణలు చేశారు. రెడ్ బుక్ రాజ్యాంగమని, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలుపై కూడా విమర్శలు చేశారు.
ఒక్క మంత్రి కూడా...
కానీ టీడీపీ నుంచి ఒక్క మంత్రి కూడా దీనిపై స్పందించలేదు. రజనీ చేసిన తప్పులను ఎండగట్టే ప్రయత్నం చేయలేదు. చివరకు ఎంపీ లావు శ్రీ కృష్ణ దేవరాయలు నేరుగా రంగంలోకి దిగి తాను కౌంటర్ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రత్తిపాటి పుల్లారావు స్పందించినప్పటికీ దానికి అంతగా ప్రాచుర్యం లభించలేదు. మంత్రులు ఇంత మంది ఉండి ఏం చేస్తున్నారన్న ప్రశ్నను తెలుగు తమ్ముళ్లు లేవనెత్తుతున్నారు. ఏసీబీ కేసు నమోదు చేయడంతో పాటు ఐపీఎస్ అధికారి చేసిన ఫిర్యాదు ఉన్నప్పటికీ ధీటుగా బదులివ్వలేని పరిస్థితి అమాత్యులకు ఎందుకు ఉందని నిలదీస్తున్నారు. ఇలాగే కొనసాగితే ప్రతిపక్ష విమర్శలను ప్రజలు నమ్మే అవకాశముందన్న హెచ్చరికలు కూడా వినిపిస్తున్నాయి.
నెగిటివ్ ప్రచారాన్ని...
దీంతో పాటు వైసీపీ నేతలు సూపర్ సిక్స్ పై విపరీతమైన నెగిటివ్ ప్రచారాన్ని ప్రారంభించారు. ఒక్కొక్కటిగా అమలు చేస్తామని చంద్రబాబు చెబుతున్నప్పటికీ ఆ విషయాన్ని ప్రజల్లో చేరవేయడంలో మంత్రులు ఎవరూ సక్సెస్ కాలేదంటున్నారు. అకాల వర్షాలతో రైతులు ఇబ్బందిపడిన విషయంపై వెంటనే చంద్రబాబు రియాక్ట్ అయ్యారు. ఆదుకుంటామని చెప్పారు.కానీ మంత్రులు ఎవరూ దీనిపై పెద్దగా స్పందించకపోవడం కూడా తమ్ముళ్ల ఆగ్రహానికి కారణమయింది. ప్రజల్లో వ్యతిరేకత ప్రబలే విధంగా, వైసీపీ అధినేత జగన్ కు హైప్ లభించేలా ప్రచారం జరుగుతున్నా దానిని పట్టించుకోకుండా అత్యధిక శాతం మంత్రులు మౌనంగా ఉండటాన్ని తప్పుపడుతున్నారు. ఒకరిద్దరు మంత్రులు మినహాయించి ఎవరూ యాక్టివ్ గా లేకపోవడం పార్టీలోనే విమర్శలకు తావిస్తుంది. చంద్రబాబు మరోసారి కేబినెట్ సమావేశంలో క్లాస్ పీకాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలుగు తమ్ముళ్లు వ్యాఖ్యానించారు.


Tags:    

Similar News