చిరుత మళ్లీ కనిపించడంతో.. భయాందోళనలో ప్రజలు

కొద్ది రోజులుగా మహానంది క్షేత్రంలో చిరుత సంచారం స్థానికులతో పాటు భక్తులను భయాందోళనలకు గురి చేస్తుంది

Update: 2024-07-17 05:27 GMT

మహానందిలో మళ్లీ చిరుత కనిపించింది. గత కొద్ది రోజులుగా మహానంది క్షేత్రంలో చిరుత సంచారం స్థానికులతో పాటు భక్తులను భయాందోళనలకు గురి చేస్తుంది. తాజాగా రాత్రి మహానంది ఆలయ పరిసర ప్రాంతానికి వచ్చిన చిరుత అక్కడ ఉన్న పందిపై దాడి చేసింది. దీనిని స్థానికులు గుర్తించి వెంటనే పెద్దగా శబ్దాలు చేయగా చిరుత అక్కడి నుంచి అడవుల్లోకి పరుగులు తీసింది. గత కొన్నాళ్లుగా చిరుత సంచారం ఉన్నా అటవీ శాఖ అధికారులు దానిని పట్టుకోలేకపోతున్నారని స్థానికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. రాత్రి వేళ భక్తులు రావాలంటేనే భయపడిపోతున్నారని చెబుతున్నారు.

చంద్రగిరి మండలంలో...
ఇదిలా ఉండగా తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం కొటాలలోనూ చిరుత సంచారం కలకలం రేపింది. కొటాలలోని జగనన్న కాలనీ వెనుక వైపు తిరుగుతున్న చిరుతను గుర్తించిన స్థానికులు వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. పాదముద్రలను బట్టి దానిని చిరుత పులిగా అటవీ శాఖ అధికారులు నిర్ధారించారు. చిరుత సంచారం ఉండటంతో స్థానికులు రాత్రి ఆరు గంటలు దాటితే బయటకు రావడానికి భయపడిపోతున్నారు. అటవీ శాఖ అధికారులు మాత్రం ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, చిరుతను పట్టుకునేందుకు తాము అన్ని ఏర్పాట్లు చేస్తామని హామీ ఇచ్చారని చెబుతున్నారు.


Tags:    

Similar News