Ys Jagan : జగన్ మరోసారి అధికారంలోకి రారా? ఇదే నేతల అతిపెద్ద డౌటా?
పార్టీ నాయకుల్లో వైసీపీ అధినేత జగన్ నాయకత్వంపై నమ్మకం లేకపోయినందునే వలసలు ఎక్కువగా ఉన్నాయన్న కామెంట్స్ వినపడుతున్నాయి.
2014 -2019 మధ్య కాలంలో వైఎస్ జగన్ అధికారంలో లేరు. అయినా పార్టీలో చేరికలే తప్ప వలసలు పెద్దగా లేవు. జగన్ నాయకత్వంపై నాడు నమ్మకమే నేతలను వెంట నడిపించింది. అక్కడక్కడ ఒకరిద్దరు నేతలు మినహాయిస్తే రాష్ట్ర వ్యాప్తంగా లీడర్లు జగన్ వెంటనే నడిచారు. వైసీపీ అధికారంలోకి రావడం ఖాయమని నమ్మారు. జగన్ ను నమ్ముకుని సొంత డబ్బులు ఖర్చు చేశారు. అధికారంలోకి వస్తే తమకు పదవులు వస్తాయని ఆశపడ్డారు. అదే సమయంలో తాము కూడా నాలుగు రూకలు సంపాదించుకోవచ్చని ద్వితీయ శ్రేణి నేతలు కూడా ఐదేళ్లు యాక్టివ్ గానే ఉన్నారు. అప్పటి అధికార పార్టీపై విమర్శలతో విరుచుకుపడే వారు.
ఐదేళ్లు చూసిన తర్వాత...
కానీ కట్ చేస్తే 2019లో అధికారంలోకి వైఎస్ జగన్ వచ్చారు. మన రాతలు మారతాయని అనుకున్నారు. పదవులు రావడం ఖాయమని భావించారు. కానీ జగన్ ఆలోచనలు మారాయి. వైఎస్ జగన్ గెలుపే లక్ష్యంగా క్యాస్ట్ పాలిటిక్స్ కు తెరతీశారు. వెల్‌ఫేర్ నే నమ్ముకున్నారు. తనను నమ్ముకున్న వారిని మాత్రం వదిలేశారు. నేతల ట్రాక్ రికార్డు చూసి కాకుండా అధికారంలో ఉన్న కేవలం క్యాస్ట్ బేసిస్ మీదనే జగన్ పదవుల పంపకాలు చేపట్టారు. 2019 ఎన్నికల్లో గెలిచినట్లుగానే అంతా తన బొమ్మతోనే గెలుస్తారని భ్రమించారు. అందుకే కరడు గట్టిన వైసీపీ నేతలను దూరం చేసుకున్నారు. నాలుగు గోడలకు పరిమితమై ఐదేళ్ల పాటు నవ్వుతూ కాలం గడిపేశారు.
నేతలు వదలి పోతున్నా...
కానీ 2024 ఎన్నికల్లో కేవలం 11 స్థానాలకే వైసీపీ పరిమితమయింది. ఇది కూడా పూర్తిగా వైఎస్ జగన్ బొమ్మే కారణమని చెప్పక తప్పదు. ఎన్నికలకు ముందు జనంలోకి వచ్చి సిద్ధం అంటూ సభలను పెట్టినా జనం అయితే హాజరయ్యారు కానీ ఓట్లు వేయించేందుకు మాత్రం లీడర్లు వెనక్కు తగ్గారు. ఇప్పుడు ఉన్న నేతలు వెళ్లిపోతున్నారు. ఒక్కొక్కరుగా తమ దారి తాము చూసుకుంటున్నారు. మరోసారి జగన్ అధికారంలోకి వస్తారన్న నమ్మకం లేకనా? లేకపోతే జగన్ కు ఎంతదూరం పాటిస్తే అంత మంచిదని భావిస్తున్నారో తెలియదు కానీ.. అయిన వాళ్లు కూడా వైఎస్ జగన్ ను పట్టించుకోవడం లేదు. పదవులు పొందిన వారు, ఆర్థికంగా లబ్ది పొందిన వారు కూడా హ్యాండ్ ఇచ్చారు.
సింహం సింగిల్ అంటూ...
ఇక తాను ఒక్కడినే సింహం సింగిల్ గా వస్తుందంటూ వైఎస్ జగన్ బీరాలు పోయారు. ఏ పార్టీని కలుపుకుని పోయేందుకు ముందుకు రాలేదు. చివరకు కమ్యునిస్టులను కూడా కాదనుకున్నారు. ఇప్పుడు అధికార పార్టీ పై పోరాటం చేయాలంటే ఒంటరి పోరాటం చేయడం తప్ప జగన్ ముందు మరో మార్గం లేదు. జగన్ కు ఇప్పటికీ అహం అడ్డం వస్తుందని వైసీపీ సీనియర్ నేత ఒకరు వ్యాఖ్యానించారు. బలం లేకపోయినా రాష్ట్రంలో కమ్యునిస్టులతో కలసి పోరాటం చేస్తే కొంత వరకూ సానుకూలత ఏర్పడేదన్నారు. వామపక్ష నేతలతో మాట్లాడాలని చెప్పినా వైఎస్ జగన్ వినిపించుకోవడం లేదని అంటున్నారు. మొత్తం మీద జగన్ తన వైఖరిని మార్చుకునేటట్లు కనిపించడం లేదు.