Weather Report : రెండు రోజులు కూల్ వాతావరణం.. ఈదురుగాలులతో కూడిన వర్షాలు
వాతావరణ శాఖ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వాసులకు తీపికబురు చెప్పింది.;

వాతావరణ శాఖ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వాసులకు తీపికబురు చెప్పింది. మరో రెండు రోజుల పాటు వర్షాలు పడతాయని తెలిపింది. ఏపీ, తెలంగాణలలో అనేకచోట్ల ఈదురుగాలులతో కూడి వర్షం పడుతుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. కొన్ని చోట్ల పిడుగులు పడే అవకాశముందని, పశువుల కాపర్లు, రైతులు పొలాలకువెళ్లినప్పుడు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. వాతావరణం చల్ల బడటంతో ప్రజలు కొంత సేదతీరుతున్నారు. మార్చి నెలలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో అల్లాడిపోయిన ప్రజలకు ద్రోణి ప్రభావంతో చల్లబడటం కొంత ఊరటనిచ్చిందనే చెప్పాలి.
రైతులకు పంట నష్టం...
కానీ అదే సమయంలో ఈదురుగాలులు వర్షంతో పంటలు దెబ్బతింటున్నాయి. ముఖ్యంగా, మామిడి, మొక్కజొన్న అరటి, బత్తాయి, నిమ్మ వంటి తోటలు దారుణంగా రెండు రాష్ట్రాల్లో దెబ్బతిన్నాయి. వడగళ్ల వానలు కూడా పడటంతో రైతులు ఇబ్బందులుపడుతున్నారు. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు పంటల్లో నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించి సహాయం అందిస్తామని భరోసాఇచ్చారు. ఈరోజు, రేపు కూడా వర్షాలు, ఈదురుగాలులు వీస్తాయని తెలియడంతో ముఖ్యంగా మామిడి రైతులు ఆందోళన చెందుతున్నారు. పూత రాలిపోతుందని, కాయలు కూడా గాలుల దెబ్బకు పడిపోతుండటంతో తమకు తీవ్రమైన నష్టం సంభవిస్తుందని తెలిపారు.
ఈ జిల్లాలకు ఎల్లో అలెర్ట్...
ద్రోణి ప్రభావంతో రెండు రాష్ట్రాల్లో సోమ, మంగళవారాల్లో వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో వర్షాలు పడతాయని తెలిపింది. ఉరుములు, పిడుగులతో కూడిన వర్షాలు పడతాయని హెచ్చరించింది. తెలంగాణలోని నల్లగొండ, వరంగల్, జనగామ, సిద్ధిపేట, రంగారెడ్డి, హైదరాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. ఉష్ణోగ్రతలు కనిష్టంగానే నమోదవుతాయని తెలిపింది.