Nagababu : నాగబాబు విషయంలో పవన్ యూటర్న్ ఎందుకు తీసుకున్నారంటే?

జనసేన నేత నాగబాబుకు మంత్రి పదవి విషయంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పునరాలోచనలో పడటానికి అనేక కారణాలున్నాయి.;

Update: 2025-03-05 06:25 GMT
nagababu, janasena, minister, pawan kalyan
  • whatsapp icon

జనసేన నేత నాగబాబుకు మంత్రి పదవి విషయంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పునరాలోచనలో పడటానికి అనేక కారణాలున్నాయి. ఆయనను ఈ ఐదు ఎమ్మెల్సీ పదవుల్లో ఒకటి ఇచ్చి మార్చి నెలలో మంత్రి వర్గ విస్తరణ చేపడతామని పవన్ కల్యాణ్ ప్రకటించారు. అయితే ఆయన మనసు మార్చుకోవడానికి రాజకీయ కారణాలున్నాయంటున్నారు. నాడు జరిగిన మీడియా సమావేశంలోనూ నాగబాబు పార్టీ బలోపేతం కోసం పనిచేశారని, ఆయనను కేబినెట్ లోకి తీసుకుంటున్నామని కూడా తెలిపారు. నాగబాబు మంత్రివర్గంలో చేరే విషయంలో చంద్రబాబు కూడా మీడియాకు క్లారిటీ ఇచ్చారు. ఒక స్థానం ఖాళీగా ఉండటంతో నాగబాబుకు రిజర్వ్ అయిందని ఆయన అనడంతో ఇక ఎవరికీ ఎలాంటి సందేహం లేదు.

మార్చి నెల వచ్చేయడంతో...
మార్చినెల వచ్చేసింది. ఐదు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అయ్యాయి. అందులో ఒకటి నాగబాబుకు రిజర్వ్ అయిందన్న ప్రచారం జోరుగా సాగింది. మంత్రి వర్గ విస్తరణ ఈ నెలలోనే జరుగుతుందని కూడా అందరూ భావించారు. కానీ పవన్ కల్యాణ్ మాత్రం ఉన్నట్లుండి తన మనసును మార్చుకున్నారు. నాగబాబును మంత్రివర్గంలోకి తీసుకోవడం కంటే రాజ్యసభకు పంపడమే మంచిదని భావించారు. తమ పార్టీకి రాజ్యసభలో ప్రాధాన్యం లేకపోవడంతో అది గౌరవ ప్రదమైన పదవి కావడంతో దాని వైపు పవన్ కల్యాణ్ మొగ్గు చూపినట్లు తెలిసింది. రెండు రోజుల క్రితం చంద్రబాబు తో సమావేశమైన పవన్ కల్యాణ్ ఈ విషయాన్ని వివరించినట్లు తెలిసింది. అందుకు చంద్రబాబు కూడా అంగీకరించినట్లు సమాచారం.
కార్పొరేషన్ పదవి...
అయితే రాజ్యసభ స్థానం ఖాళీ అయ్యేలోగా ముందుగా కార్పొరేషన్ పదవి ఇవ్వాలని కూడా చంద్రబాబును పవన్ కల్యాణ్ కోరినట్లు సమాచారం. ఇందుకు చంద్రబాబు అంగీకరించారని, నాగబాబును తర్వాత ఖాళీ అయ్యే రాజ్యసభ స్థానాల్లో నియమించే అవకాశాలున్నాయని చెబుతున్నారు. నాగబాబు కూడా మంత్రి పదవి పట్ల ఆసక్తిగా లేరని అంటున్నారు. తాను పెద్దల సభకు వెళితేనే హుందాగా ఉంటుందని ఆయన భావించి తన మనసులో మాటను పవన్ కల్యాణ్ కు చెప్పడం వల్లనే ఆయన కూడా అదే మంచిదన్న అభిప్రాయానికి వచ్చినట్లు తెలిసింది. దీంతో పాటు మంత్రివర్గంలో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు ఉండటం కూడా సరికాదని నాగబాబు అన్నట్లు తెలిసింది. అందుకే ఆయనకు ముందుగా కార్పొరేషన్ పదవి ఇచ్చి తర్వాత రాజ్యసభకు ఎంపిక చేయనున్నారని తెలిసింది.


Tags:    

Similar News