ఏపీలో కల్వకుంట్ల కవిత.. ఎక్కడకు వచ్చారంటే?

బ్రిటీష్ హయాంలో కూడా ముంగండ గ్రామ ప్రజలు ఎంతో సాహసం చేసి దేవాలయాలను పరిరక్షించారని

Update: 2024-02-25 15:27 GMT

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఏపీలోని అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పర్యటించారు. ఓ ఆలయ పునః ప్రతిష్ట కార్యక్రమంలో భాగంగా.. పి.గన్నవరం మండలం ముంగండ గ్రామదేవత ముత్యాలమ్మ ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవంలో కవిత పాల్గొన్నారు. అమ్మవారి దర్శనానంతరం కవిత మాట్లాడుతూ.. ముత్యాలమ్మ తల్లి ఆలయ పునరుద్ధరణ కార్యక్రమంలో పాల్గొనడం తన అదృష్టంగా భావిస్తున్నానన్నారు. ముత్యాలమ్మ అమ్మవారి ఆలయానికి 400 ఏళ్ల చరిత్ర ఉందని, అలాంటి ఆలయ పునరుద్ధరణ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారిని దర్శించుకోవడం శుభపరిణామమని అన్నారు. బ్రిటీష్ హయాంలో కూడా ముంగండ గ్రామ ప్రజలు ఎంతో సాహసం చేసి దేవాలయాలను పరిరక్షించారని కవిత కొనియాడారు. ముత్యాలమ్మ తల్లి ముంగండ గ్రామాన్నే కాకుండా తెలుగు రాష్ట్రాలను అభివృద్ధి పథంలో తీసుకెళ్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కల్వకుంట్ల కవితతో ఫోటోలు దిగడానికి పెద్ద ఎత్తున జనం వచ్చారు.

ఢిల్లీ లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవితను నిందితురాలిగా చేర్చుతూ కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ నోటీసులు జారీ చేయగా.. తాజాగా ఎమ్మెల్సీ కవిత సీబీఐకి లేఖ రాశారు. సీఆర్పీసీ సెక్షన్ 41ఏ కింద జారీ చేసిన నోటీసులను రద్దు చేయాలని లేదా ఉపసంహరించుకోవాలని ఆమె కోరారు. ఒకవేళ తన నుంచి సీబీఐకి ఏవైనా ప్రశ్నలకు సమాధానం, సమాచారం కావాలనుకుంటే వర్చువల్ పద్ధతిలో హాజరవ్వడానికి అందుబాటులో ఉంటానని తెలిపారు. ముందే నిర్ణయించిన కార్యక్రమాలు ఉన్నందున ఈ నెల 26న విచారణకు హాజరుకావడం తనకు సాధ్యంకాదని ఆమె చెప్పారు. సీఆర్పీసీ సెక్షన్ 41ఏ కింద నోటీసులు ఇవ్వడం సబబు కాదని ఆమె అభ్యంతరం వ్యక్తం చేశారు. నాకు ఎన్నికల ప్రచార బాధ్యతలు ఉన్నందున ఢిల్లీకి పిలవడం అనేది ఎన్నికల ప్రక్రియలో పాల్గొనకుండా అవరోధం కలిగిస్తుందని.. ఇది నా ప్రజాస్వామిక, రాజ్యాంగ హక్కులకు భంగం కలిగిస్తుందన్నారు. సీబీఐ చేస్తున్న ఆరోపణల్లో నా పాత్ర లేదు.. పైగా కేసు కోర్టులో పెండింగ్‌లో ఉందన్నారు.


Tags:    

Similar News