Ys Jagan : జగన్ కు దగ్గర ఎవరు? దూరం ఎవరు?

జగన్ కు దగ్గరగా ఇప్పుడు ఒకరిద్దరు నేతలు మాత్రమే కనిపిస్తున్నారు. అధికారంలో ఉన్నప్పుడు వెంట ఉన్న నేతలు దూరమయ్యారు

Update: 2024-08-26 07:07 GMT

అధికారంలో ఉన్నప్పడు అందరూ బెల్లం చుట్టూ ఈగల్లా చేరతారు. పదవుల కోసం పైరవీలు చేస్తారు. పదవుల్లో కూర్చుని ఎంజాయ్ చేస్తారు. అయితే అదే అధికారం కోల్పోయిన తర్వాత మాత్రం ఆ నేత చుట్టూ ఎవరూ ఉండరు. కేసుల భయం కావచ్చు. అనవసర జేబు ఖర్చు ఎందుకని భావించవచ్చు. లేదంటే ఎన్నికల సమయానికి తిరిగి యాక్టివ్ కావచ్చని తలంపుతో చాలా మంది దూరంగా ఉంటారు. ఇది ఏ పార్టీకో కాదు... అన్ని పార్టీల్లో జరిగేదే. ఐదేళ్ల పాటు తిరిగి ఓడిపోయిన పార్టీ నేత వెంట తిరిగే సాహసం ఎవరూ చేయరు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధినేత జగన్ పరిస్థితి కూడా అలాగే తయారయింది.

వీళ్లు మాత్రమే...
జగన్ కు దగ్గరగా ఇప్పుడు ఒకరిద్దరు నేతలు మాత్రమే కనిపిస్తున్నారు. సజ్జల రామకృష్ణారెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, వైవీ సుబ్బారెడ్డితో పాటు మాజీ ఐఏఎస్ అధికారి ధనుంజయ్ రెడ్డి మాత్రమే జగన్ కు అందుబాటులో ఉంటున్నారట. తాడేపల్లి పార్టీ కార్యాలయంలో ఇప్పుడు మళ్లీ వీరే ఎక్కువగా కనిపిస్తున్నారు. అంతకు ముందు అధికారంలో ఉన్నప్పుడు పదవులు వెలగబెట్టిన వారంతా ముఖం చాటేస్తున్నారు. వారు ఎక్కువగా హైదరాబాద్‌కు వెళ్లి అక్కడే మకాం పెట్టారు. విజయవాడ రమ్మని పిలిచినా రావడం లేదు. ఇక ఎవరి సొంతపనులు వారు చక్కబెట్టుకునే ప్రయత్నంలో ఉన్నారని పార్టీ వర్గాలే చెబుతున్నాయి.
దూరంగా ఉంటున్న నేతలు...
విజయసాయి రెడ్డి ఎక్కువగా ఢిల్లీకే పరిమితమయ్యారు. ప్రభుత్వ పదవులు అనుభవించిన జీవీడీ కృష్ణమోహన్ తో పాటు మరికొందరు ఇప్పుడు హైదరాబాద్ లోనే ఉంటున్నారు. అయితే దీనికి కారణం జగన్ ఎక్కువగా బెంగళూరులో ఉంటున్నందున తమకు పనిలేదని పైకి చెబుతున్నప్పటికీ జగన్ పర్యటనల్లో కూడా నేతలు ఎవరూ కనిపించకపోవడం పార్టీలో హాట్ టాపిక్ గా మారింది. అధికారంలో జగన్ కు అతి దగ్గరగా ఉన్న నేతలు నేడు దూరమవ్వడానికి మరొక కారణం కూడా ఉందంటున్నారు. విజయవాడలో ఉండటం వల్ల ఖర్చుతో కూడుకున్న పని అని, దీంతో పాటు కేసులు తమ మెడకు ఎక్కడ చుట్టుకుంటాయోనని భయపడి మౌనంగా ఉంటున్నారు.
సీమ నేతలు కూడా...
ముఖ్యంగా రాయలసీమకు చెందిన నేతలు ఎక్కువ మంది పార్టీకి దూరంగా ఉంటున్నారు. అధికారంలో ఉన్నప్పడు కాంట్రాక్టర్లు పొంది నాలుగు రూపాయలు సంపాదించుకున్న వారు కూడా ఇప్పుడు జగన్ కు కనిపించకుండా తప్పించుకుని తిరుగుతున్నారు. ఇప్పడు వీరందరి జాబితాను జగన్ టీం రూపొందించే పనిలో ఉందని అంటున్నారు. అవసరమైనప్పుడు, పార్టీ కష్టకాలంలో ఉన్నప్పడు అండగా ఉండాల్సిన నేతలను భవిష్యత్ లో దగ్గరకు రానివ్వ కూడదని జగన్ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. తన వెంట ఈ ఐదేళ్ల పాటు ఉన్న వారికే భవిష్యత్ ఉంటుందని తన వద్దకు వచ్చిన కొందరు నేతలలో జగన్ అన్నట్లు పార్టీలో పెద్దయెత్తున ప్రచారం జరుగుతుంది.


Tags:    

Similar News