Nellore : అక్కడ పులి ఉందట.. కానీ కారుకు డ్యాష్ ఇచ్చింది మాత్రం పులి కాదట
నెల్లూరు జిల్లాలోని అటవీప్రాంతంలో పులి సంచారం ఉందని అటవీ శాఖ అధికారులు తెలిపారు
నెల్లూరు జిల్లాలోని అటవీప్రాంతంలో పులి సంచారం ఉందని అటవీ శాఖ అధికారులు తెలిపారు. చుట్టుపక్కల గ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. ఎవరూ రాత్రి వేళ కానీ, పగలు కానీ ఒంటరిగా వెళ్లవద్దని కూడా చెప్పారు. అటవీ ప్రాంతంలో పులి సంచారాన్ని గమనించినట్లు, పులి కాలి వేలిముద్రలను గుర్తించామని తెలిపారు. అయితే జిల్లాలో ఉన్న పెద్ద పులి మర్రిపాడు వద్ద కారును గుద్దుకుని వెళ్లిందనడంలో వాస్తవం లేదని అటవీ శాఖ అధికారులు చెప్పారు. కారుకు జరిగిన డ్యామేజీని చూస్తే పెద్దపులి గుద్దినట్లుగా లేదని అభిప్రాయపడ్డారు.
డ్రోన్ కెమెరాలతోనూ...
కారుపై పులి దాడి చేసిందన్న వార్తలో నిజం లేదని తెలిపారు. ప్రమాదం జరిగిన సమయంలో పులి పాదముద్రలు అయితే కనిపించాయని, అయితే ఎక్కడా రక్తపు మరకలు లేవని తెలిపారు. పులికి నిజంగా ప్రమాదం జరిగితే నొప్పికి తాళలేదని, అరుస్తుందని, కానీ అటువంటి అరుపులు ఏవీ వినిపించడం లేదని అటవీ శాఖ అధికారులు చెప్పారు. డ్రోన్ కెమెరాలతో చుట్టుపక్కల ప్రాంతాలన్నింటినీ పరిశీలించినా పులి జాడ తెలియలేదన్నారు. అటవీ ప్రాంతంలో పులి ఉన్న మాట నిజమే కానీ, కారును గుద్దిన ఘటనలో పులి ప్రమేయం లేదని అటవీ శాఖ అధికారులు మీడియాకు తెలిపారు.