ఈ గొడవలు ఇప్పటివి కావంటున్న పెద్దిరెడ్డి

పుంగనూరులో చోటు చేసుకున్న హింసపై వైసీపీ నేత పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి

Update: 2023-08-05 11:12 GMT

పుంగనూరులో చోటు చేసుకున్న హింసపై వైసీపీ నేత పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి మాట్లాడారు. విద్యార్థి దశ నుంచే తనతో చంద్రబాబుకు గొడవ ఉందని అన్నారు. అందుకే పుంగనూరులో టీడీపీ నేతలను, కార్యకర్తలను చంద్రబాబు రెచ్చగొట్టారని అన్నారు. పుంగనూరు ఘటనకు చంద్రబాబే కారణమని.. మతిభ్రమించి నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారని అన్నారు. బైపాస్ రోడ్ లో వెళ్తానని రోడ్ మ్యాప్ ఇచ్చి పుంగనూరు పట్టణంలోకి వచ్చారని.. తన కాన్వాయ్ లో రౌడీమూకలను, కర్రలను, రాళ్లను తెచ్చారని చెప్పారు. పోలీసులపై దాడి చేశారని.. ఓటమి భయంతో హింసా రాజకీయాలకు పాల్పడుతున్నారని విమర్శించారు.

ఎస్వీ యూనివ‌ర్సిటీలో పెద్దిరెడ్డి కంటే చంద్ర‌బాబు ఏడాది సీనియ‌ర్ విద్యార్థి. చంద్రబాబు నాయుడు ఎక‌నామిక్స్ చదవగా.. పెద్దిరెడ్డి సోషియాల‌జీ చదివారు. కాలేజీలో ఉన్న సమయంలో ఎస్వీయూ చైర్మ‌న్‌గా చంద్ర‌బాబు అవ్వలేకపోయారు. 1974లో కేవ‌లం ఎక‌నామిక్స్ విభాగం చైర్మ‌న్ ప‌ద‌వితోనే చంద్ర‌బాబు స‌రిపెట్టుకున్నారు. ఆ ఏడాది కేవీ ర‌మ‌ణారెడ్డి ఎస్వీయూ చైర్మ‌న్‌గా గెలుపొందారు. ఎస్వీయూలో క‌మ్మ‌, రెడ్డి సామాజిక వ‌ర్గాల మ‌ధ్య ఆధిప‌త్య పోరు సాగేది. 1975లో ఎస్వీయూ చైర్మ‌న్‌గా పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి ఎన్నిక‌య్యారు. ఆ ఏడాది చంద్ర‌బాబు ఎస్వీయూలో రీసెర్చ్ స్కాల‌ర్‌గా జాయిన్ అయ్యారు. ఆ త‌ర్వాత చంద్ర‌గిరి నుంచి కాంగ్రెస్ (ఐ) త‌ర‌పున చంద్ర‌బాబు త‌న స‌మీప ప్ర‌త్య‌ర్థి, జ‌న‌తా పార్టీ అభ్య‌ర్థి కె.ప‌ట్టాభిరామ చౌద‌రిపై గెలుపొందారు. ఇదే ఎన్నిక‌ల్లో పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి పీలేరులో జ‌న‌తాపార్టీ త‌ర‌పున బ‌రిలో నిలిచి కాంగ్రెస్(ఐ) అభ్య‌ర్థి సైపుల్లాబేగ్ చేతిలో ఓడిపోయారు. పెద్దిరెడ్డికి మాజీ రాష్ట్ర‌ప‌తి, దివంగ‌త నీలం సంజీవ‌రెడ్డి రాజకీయ గురువు. అప్ప‌ట్లో ఎమర్జెన్సీ త‌ర్వాత జ‌రిగిన ఎన్నిక‌ల్లో నంద్యాల నుంచి నీలం సంజీవ‌రెడ్డి జ‌న‌తా పార్టీ త‌ర‌పున పోటీ చేశారు. ఈ ఎన్నిక‌ల్లో నీలం సంజీవ‌రెడ్డి త‌ర‌పున పెద్దిరెడ్డి నేతృత్వంలోని ఎస్వీయూ విద్యార్థులు చురుగ్గా ప‌ని చేశారు. ద‌క్షణాదిలో గెలిచిన ఏకైక ఎంపీగా నీలం రికార్డుకెక్కారు. విద్యార్థి నాయ‌కుడిగా ప‌ని చేసిన పెద్దిరెడ్డిపై నీలం సంజీవ‌రెడ్డికి ప్ర‌త్యేక అభిమానం వుండేది. విద్యార్థిగా ఉండ‌గానే పెద్దిరెడ్డికి జ‌న‌తా పార్టీ టికెట్‌ను నీలం సంజీవ‌రెడ్డి ఇప్పించార‌ని అంటుంటారు. అప్పట్లో వారి మధ్య ఎన్నో గొడవలు కూడా జరిగాయని చెబుతారు. చ‌దువుకునే రోజుల్లో పెద్దిరెడ్డి, చంద్ర‌బాబు మ‌ధ్య ఏర్ప‌డిన రాజ‌కీయ వైరం ఇప్ప‌టికీ సాగుతోంది.


Tags:    

Similar News