Pensions : నేడు ఏపీ అంతటా పింఛన్ల పంపిణీ ప్రారంభం

ఆంధ్రప్రదేశ్ లో నేడు ఉదయం నుంచి పింఛన్ల పంపిణీ కార్యక్రమం ప్రారంభమయింది.

Update: 2024-12-31 02:17 GMT

ఆంధ్రప్రదేశ్ లో నేడు ఉదయం నుంచి పింఛన్ల పంపిణీ కార్యక్రమం ప్రారంభమయింది. ఉదయం నుంచే పింఛన్లను ఇంటికి వెళ్లి వృద్ధులు, వితంతవులకు అందచేస్తున్నారు. నెలకు నాలుగు వేల రూపాయలు పింఛను అందచేస్తుండటంతో నిజమైన సంక్రాంతి వృద్ధుల కళ్లల్లో కనిపిస్తుందని ప్రజా ప్రతినిధులు చెబుతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు పల్నాడు జిల్లా యల్లమంద గ్రామానికి వెళ్లి అక్కడ లబ్దిదారులకు పింఛన్లను పంపిణీ చేయనున్నారు. అలాగే ఎమ్మెల్యేలు, మంత్రులు, పార్లమెంటు సభ్యులు కూడా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనాలని పార్టీ పిలుపు నిచ్చింది. దీంతో కూటమి పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధులందరూ పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటున్నారు.

నిధులను విడుదల చేయడంతో...
దీనికి సంబంధించిన నిధులను రెండు రోజుల క్రితమే ప్రభుత్వం విడుదల చేసింది. జనవరి 1వ తేదీ నూతన సంవత్సర వేడుకులను జరుపుకునే ఉత్సాహంలో ఉండటంతో పాటు అధికారులు, సిబ్బంది నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపే కార్యక్రమంలో ఉండటంతో ఒకరోజు ముందుగానే ఏపీలో ఈరోజు పింఛన్ల పంపిణీ కార్యక్రమం ప్రారంభమయింది. మొత్తం 65 లక్షల మంది వృద్ధులకు, వితంతువులకు నాలుగు వేల రూపాయల చొప్పున పింఛన్లు పంపిణీ చేస్తున్నారు. అదే సమయంలో దివ్యాంగులకు నెలకు ఆరు వేల రూపాయలు చొప్పున పంపిణీ చేస్తున్నారు. ఈ నెల నుంచి భర్త మరణించిన వారికి కూడా వెంటనే పింఛన్లను పంపిణీ చేయాలని చంద్రబాబు ఆదేశించారు.
భర్తను కోల్పోయిన వారికి...
దీంతో రాష్ట్రంలోని 5,403 మంది వరకూ భర్తను కోల్పోయిన వారిని అధికారులు గుర్తించారు. వారికి కూడా నేడు నాలుగు వేల రూపాయల చొప్పున పింఛను మొత్తాన్ని అందచేయాలని నిర్ణయించారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటయిన వెంటనే పింఛన్ల పంపిణీని ప్రతిష్టాత్మకంగానూ, సీరియస్ గానూ తీసుకుంది. ఆగస్టు నెల నుంచి ప్రతి నెల ఒకటోతేదీ తెల్లవారు జాము నుంచి సచివాలయం, రెవెన్యూ సిబ్బంది చేత పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టింది. వాలంటీర్లను పక్కన పెట్టి ప్రభుత్వోద్యోగుల చేతనే పంపిణీ చేయిస్తున్నారు. ఈరోజు పింఛను అందని వారికి రేపు కూడా అందచేస్తారు. ఒకేసారి మూడు నెలలు పింఛను అందుకునేందుకు కూడా వెసులుబాటును ఈ ప్రభుత్వం కల్పించింది.



Tags:    

Similar News