Andhra Pradesh : చంద్రబాబుపై కేసులను సీబీఐకి అప్పగించాలి.. హైకోర్టులో "పిల్"
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు పై ఉన్న కేసులు అన్నీ సీబీఐకి అప్పగించాలని హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలయింది
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు పై ఉన్న కేసులు అన్నీ సీబీఐకి అప్పగించాలని హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలయింది. ఈ పిటీషన్ ను స్వర్ణాంధ్ర పత్రిక ఎడిటర్ బాల గంగాధర్ తిలక్ దాఖలు చేశారు. చంద్రబాబు సహా 114 మందిని ప్రతివాదులుగా చేరుస్తూ స్కిల్ డెవలప్‌మెంట్ సహా నేతలపై కేసులన్నీ సీబీఐ, ఈడీలకు అప్పగించాలని పిటీషన్ లో కోరారు. ఎన్నికల ఫలితాల రోజునుంచే అధికారులు కొందరికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. నిష్పాక్షిక, పాదర్శకమైన దర్యాప్తు కోసం కేసులను కేంద్ర దర్యాప్తు సంస్థకు అప్పగించాలంటూ పిటిషన్ దాఖలు చేశారు.
114 మందిని ప్రతివాదులుగా...
ముఖ్యమంత్రి చంద్రబాబు సహా పలువురు టీడీపీ నేతలు, వ్యాపారవేత్తలపై ఉన్న కేసులన్నీ సీబీఐ, ఈడీలకు అప్పగించేలా ఆదేశాలు జారీ చేయాలంటూ హైకోర్టులో స్వర్ణాంధ్ర పత్రిక ఎడిటర్ కొట్టి బాలగంగాధర్ తిలక్ ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. చంద్రబాబుతో పాటు మంత్రులు నారా లోకేశ్, పొంగూరు నారాయణ, కింజారపు అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు, వ్యాపారవేత్తలు లింగమనేని రమేశ్, వేమూరు హరికృష్ణ సహా మొత్తం 114 మందిని ప్రతివాదులుగా పేర్కొన్నారు. హోం శాఖ ముఖ్య కార్యదర్శి హరీశ్ కుమార్ గుప్తాను వ్యక్తిగత హోదాలో ప్రతివాదిగా పేర్కొన్నారు.
అనేక కేసుల్లో...
స్కిల్ డెవలప్‌మెంట్ కుంభకోణం, మద్యం కుంభకోణం, ఏపీ ఫైబర్ నెట్ కుంభకోణం, అసైన్డ్ భూముుల కుంభకోణం, ఇసుకు కుంభకోణం, ఇన్నర్ రింగు రోడ్ అలైన్‌మెంట్‌లో అక్రమాలు తదితర స్కామ్‌లకు సంబంధించి దర్యాప్తు బాధ్యతలను సీబీఐ, ఈడీలకు అప్పగించాల్సిన అవసరం ఉందన్నారు. నిష్పాక్షిక, పారదర్శక, వేగవంతమైన దర్యాప్తు కోసం కేసులను సీబీఐ, ఈడీకి అప్పగించాలని అభిప్రాయపడ్డారు.ఫలితాలు వెలువడిన రోజున డీజీపీగా, పోలీసు బలగాలకు అధిపతిగా ఉన్న హరీశ్ కుమార్ గుప్తా సీఐడీలోని ఆర్థిక నేరాల విభాగానికి తాళాలు వేశారన్నారు. ప్రస్తుత ముఖ్యమంత్రి, ఇతర టీడీపీ నేతలపై నమోదైన కేసులను దర్యాప్తు చేస్తున్న అధికారులకు ప్రవేశాన్ని నిరాకరించాన్నారు. చంద్రబాబు తదితరులు అధికారంలోకి వస్తున్నారని గ్రహించి, ఆయా కేసులను దర్యాప్తు చేస్తున్న అధికారుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించారని పిటీషన్ లో పేర్కొన్నారు.
చంద్రబాబుకు అనుకూలంగా...
చంద్రబాబు, ఇతర నేతలకు అనుకూలంగా కేసులను నీరు గార్చేలా వ్యవహరిస్తున్నారని, ఈ పరిస్థితుల్లో హైకోర్టు ఈ కేసుల దర్యాప్తును సీబీఐ, ఈడీకి అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేయాలని ఆయన కోరారు. ఏపీ బెవరేజస్ కార్పొరేషన్ అప్పటి ఎండీ హోదాలో డి. వాసుదేవరెడ్డి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా సీఐడీ కేసు నమోదు చేసిందని తెలిపారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాత కక్ష సాధింపు చర్యల్లో భాగంగా వాసుదేవరెడ్డిపై కేసు నమోదు చేశారన్నారు. ఇసుక కుంభకోణంపై ఫిర్యాదు చేసినందుకు గనుల శాఖ అప్పటి డైరెక్టర్ జి.వెంకట రెడ్డిపై కక్ష తీర్చుకుంటున్నారన్నారు. తమపై ఫిర్యాదు చేసిన వారందరిపై చర్యలు తీసుకుంటామని రెడ్ బుక్ పేరిట పలువురు అధికారులను వేధిస్తున్నారని తెలిపారు. ఈ విషయాలన్నింటినీ పరిగణలోకి తీసుకోవాలని ఆయన తన పిటీషన్ లో పేర్కొన్నారు.