వైఎస్ భక్తుడిని నేను.. అది ఫోన్ ట్యాపింగ్ కాదు
ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలపై కోటంరెడ్డి శ్రీధర రెడ్డి రామశివప్రసాద్ రెడ్డి స్పందించారు. ఆయన నెల్లూరులో మీడియాతో మాట్లాడారు.
ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలపై కోటంరెడ్డి శ్రీధర రెడ్డి రామశివప్రసాద్ రెడ్డి స్పందించారు. ఆయన నెల్లూరులో మీడియాతో మాట్లాడారు. శ్రీధర్ రెడ్డి విడుదల చేసిన ఆడియో కేవలం రికార్డింగ్ మాత్రమేనని తెలిపారు. తన ఫోన్ లో ఆటోమేటిక్ గా రికార్డు అవుతుందని తెలిపారు. కోటంరెడ్డి ఒక కాంట్రాక్టరు విషయంలో మాట్లాడిన మాటలను తాను మరో స్నేహితుడైన కాంట్రాక్టర్ కు పంపానని, అది వైరల్ అయిందని ఆయన వివరణ ఇచ్చారు. ఇన్నాళ్లూ ఈ వివాదంలోకి తాను ఎందుకు జోక్యం చేసుకోవడం అని అనుకున్నానని రామ శివప్రసాద్ రెడ్డి తెలిపారు.
నన్నెవరూ బెదిరించలేదు...
అయితే ప్రభుత్వంపై ఆరోపణలు రోజురోజుకూ అధికం కానుండటంతో మాట్లాడాల్సిన అవసరం ఏర్పడిందన్నారు. ఒక కాంట్రాక్టర్ కు తాను వినిపించిన ఆడియో బయటకు వచ్చిందని, దానిని కోటంరెడ్డి ఫోన్ ట్యాపింగ్ అని భావిస్తున్నారన్నారు. ఇంత జరుగుతుందని తాను ఊహించలేదన్నారు. తాను వైఎస్ రాజశేఖర్ రెడ్డికి భక్తుడినని, ముప్ఫయి ఏళ్లుగా ఆయన అభిమానని చెప్పుకొచ్చారు. తాను ఎవరో జగన్ కు తెలియదని, తనపై ఎవరి వత్తిడి లేదని, స్వచ్ఛందంగానే ముందుకు వచ్చి మీడియాకు అసలు విషయాన్ని చెబుతున్నానని ఆయన తెలిపారు. తనపై అధికార పార్టీ ఎలాంటి బెదిరింపులకు పాల్పడలేదన్నారు.