Tirumala : తిరుమలలో కొనసాగుతున్న రద్దీ.. శనివారం కావడంతో?
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. శనివారం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో తిరుమలలో ఉన్నారు. .
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. శనివారం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో తిరుమలలో ఉన్నారు. కంపార్ట్‌మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి చూస్తున్నారు. శనివారం కావడంతో స్వామి వారిని దర్శించుకుంటే మంచిదని భావించిన భక్తులు ఎక్కువ మంది తిరుమలకు చేరుకుంటుండటంతో రద్దీ పెరిగింది. దర్శనానికి ఎక్కువ సమయం పడుతుంది. కంపార్ట్‌మెంట్లలో ఉన్న భక్తులు గంటల తరబడి వెయిట్ చేయాల్సి వస్తుంది. సాధారణంగా శని, ఆదివారాలు తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. అందుకు తగినట్లుగా తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ఏర్పాట్లు చేస్తారు. వసతి గృహాల దగ్గర నుంచి అన్న ప్రసాదాల వరకూ అన్ని భక్తులకు అందేలా చర్యలు తీసుకునేందుకు శని, ఆదివారాలు టీటీడీ ప్రత్యేకంగా ప్లాన్ చేస్తుంది.
హుండీ ఆదాయం...
ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని 26 కంపార్ట్‌మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. ఉచిత దర్శనం క్యూ లైన్ లోకి ఉదయం ఏడు గంటలకు టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం పన్నెండు గంటల సమయం పడుతుంది. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం మూడు నుంచి నాలుగు గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. నిన్న తిరుమల శ్రీవారిని 65,131 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 30,998 మంది భక్తులు తలనీలాలను సమర్పించి తమ మొక్కులు చెల్లించుకున్నారని అధికారులు వెల్లడించారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 4.66 కోట్ల రూపాయలు వచ్చిందని అధికారులు తెలిపారు.