Tirumala : తిరుమలలో నేడు కంపార్ట్‌మెంట్లన్నీ నిండి శిలాతోరణం వరకూ భక్తుల క్యూ లైన్

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. శనివారం కావడంతో భక్తుల రద్దీ మరింతగా పెరిగింది.

Update: 2024-08-17 03:24 GMT

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. శనివారం కావడంతో భక్తుల రద్దీ మరింతగా పెరిగింది. శనివారం శ్రీవెంకటేశ్వరస్వామికి ఇష్టమైన రోజు కావడంతో ఆరోజు ఎక్కువ మంది భక్తులు శ్రీవారిని దర్శించుకునేందుకు వస్తారు. ఇది కొన్ని దశాబ్దాలుగా వస్తున్న ఆనవాయితీ. కంపార్ట్‌మెంట్లన్నీ నిండిపోయాయి. బయట వరకూ భక్తులు క్యూ లైన్ లో వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. శనివారం కావడంతో తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు కూడా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటున్నారు. వరసగా ఐదు రోజులు సెలవులు రావడం కూడా భక్తుల రద్దీ పెరగడానికి కారణంగా చెబుతున్నారు. క్యూ లైన్లలో శ్రీవారి సేవకులు అన్న ప్రసాదాలను, మంచినీటిని భక్తులకు ఉచితంగా అందచేస్తున్నారు. వీలయినంత త్వరగా స్వామి వారి దర్శనం పూర్తయ్యేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.

భక్తులతో నిండిపోయి...
తిరుమలలో శనివారం అంటే రద్దీగానే ఉంటుంది. శనివారం స్వామి వారిని దర్శించకుంటే మంచిదని అందరూ భావిస్తారు. ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని అన్ని కంపార్ట్‌మెంట్లు భక్తులతో నిండిపోయాయి. క్యూ లైన్ శిల్పతోరణం వరకూ విస్తరించింది. ఉచిత దర్శనం క్యూ లైన్ లోని భక్తులకు శ్రీవారి దర్శనం ఇరవై నాలుగు గంటల సమయం పడుతుంది. టైమ్ స్లాట్ భక్తులకు శ్రీవారి దర్శనం ఐదు గంటల నుంచి ఆరు గంటల సమయం పడుతుంది. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం నాలుగు నుంచి ఐదు గంటల సమయం పడుతుంది. నిన్న తిరుమల శ్రీవారిని 62,625 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 34,462 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.63 కోట్ల రూపాయలు వచ్చిందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు.


Tags:    

Similar News