Tirumala : ఈరోజు తిరుమలలో రద్దీ మామూలుగా లేదుగా?

తిరుమలలో భక్తుల రద్దీ ఒక్కసారిగా పెరిగింది. ఈరోజు ఆదివారం మాత్రం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది

Update: 2024-09-29 03:13 GMT

తిరుమలలో భక్తుల రద్దీ ఒక్కసారిగా పెరిగింది. నిన్న శనివారం కొంత తగ్గినట్లు కనిపించినా ఆదివారం మాత్రం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. దసరా సెలవులకు ముందే భక్తులు పెద్దయెత్తున తిరుమలకు పోటెత్తుతుండటంతో తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు అందుకు తగినట్లు ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసేందుకు అన్ని చర్యలు ప్రారంభమయ్యాయి. సహజంగా ఆదివారం నాడు తిరుమలలో రద్దీ ఎక్కువగా ఉంటుంది. కానీ గత కొద్ది రోజుల నుంచి తక్కువగా ఉన్న భక్తుల సంఖ్య ఒక్కసారిగా పెరగడంతో అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. తిరుమల వీధులన్నీ భక్తులతో కిటకిటలాడిపోతున్నాయి. స్వామి వారి దర్శనం కూడా గంటల తరబడి సమయం వేచి చూడాల్సి వస్తుందని భక్తులు తెలిపారు. క్యూ లైన్ లోకే అన్న ప్రసాదాలు, మంచినీరు తెచ్చిస్తున్నా భక్తులు మాత్రం తక్కువగా లేకపోవడంతో కొంత ఇబ్బందులు పడక తప్పడం లేదు. తిరుమలలో వసతి గృహాలు దొరకడం కూడా కష్టంగా మారింది.

అన్ని కంపార్ట్ మెంట్లు నిండిపోయి...
ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్ మెంట్లు భక్తులతో నిండిపోయాయి. శ్రీవారి దర్శనం కోసం క్యూ లైన్ బయట కృష్ణతేజ గెస్ట్ లైన్ వరకూ విస్తరించింది. పెద్ద పెద్ద క్యూ లైన్లలో భక్తులు దర్శనం కోసం వేచి చూస్తున్నారు. ఉచిత దర్శనం క్యూ లైన్ లోకి ఈరోజు ఉదయం ఏడు గంటలకు టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం 24 గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. టైమ్ స్లాట్ దర్శనం టోకెన్లున్న భక్తులకు మాత్రం ఆరు నుంచి ఏడు గంటల్లో దర్శనం పూర్తవుతుంది. ఇక మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం మూడు నుంచి నాలుగు గంటల సమయం పడుతుందని అధికారులు తెలిపారు. నిన్న తిరుమల శ్రీవారిని 71133 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 35,502 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.28 కోట్ల రూపాయలు మాత్రమే వచ్చిందని అధికారులు తెలిపారు.



Tags:    

Similar News