కోవిడ్ ఎఫెక్ట్ : శ్రీశైలంలో మల్లికార్జునస్వామి సర్వ దర్శనం నిలిపివేత

ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైల మల్లికార్జునస్వామి సర్వ దర్శనంతోపాటు అన్న ప్రసాద వితరణ, శఠారి, తీర్థం, వేదాశీర్వచనం

Update: 2022-01-17 06:59 GMT

ఆంధ్రప్రదేశ్ లో కోవిడ్.. చాపకింద నీరులా విస్తరిస్తోంది. రోజురోజుకూ వేలల్లో నమోదవుతున్న కేసులు ప్రజల గుండెల్లో గుబులు రేపుతున్నాయి. రోజువారీ కేసులు పెరుగుతుండటంతో.. రాష్ట్రం యాక్టివ్ కేసుల సంఖ్య ఎక్కువవుతోంది. ఈ నేపథ్యంలో ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో అమ్మవార్లు, స్వామివార్ల దర్శనాల్లో స్వల్ప మార్పులు జరుగుతున్నాయి. ఇప్పటికే దుర్గగుడిలో కరోనా కేసు నమోదవ్వడంతో.. అమ్మవారి అంతరాలయ దర్శనాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ఈఓ భ్రమరాంబ వెల్లడించిన సంగతి తెలిసిందే. తాజాగా శ్రీశైలం ఆలయంపై కూడా కోవిడ్ ఎఫెక్ట్ పడింది.

ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైల మల్లికార్జునస్వామి సర్వ దర్శనంతోపాటు అన్న ప్రసాద వితరణ, శఠారి, తీర్థం, వేదాశీర్వచనం, పాతళ గంగలో పుణ్య స్నానాలను తాత్కాలికంగా నిలిపివేశారు. ఈ మేరకు ఆలయ ఈఓ ఎస్ . లవన్న ప్రకటన విడుదల చేశారు. ఇకపై ఆన్‌లైన్‌లో టికెట్లు బుక్ చేసుకుని వచ్చే భక్తుల్లో గంటకు వెయ్యి మందిని మాత్రమే అనుమతిస్తామన్నారు. వృద్ధులు, గర్భిణులు, చంటిపిల్లల తల్లులు, పదేళ్లలోపు పిల్లలతో కలిసి దర్శనానికి రావొద్దని సూచించారు. అలాగే రేపట్నుంచి తదుపరి ఆదేశాలొచ్చేంతవరకూ ఆర్జిత సేవల టికెట్లను ఆన్ లైన్ ద్వారా మాత్రమే పొందాల్సి ఉంటుందని తెలిపారు. ఆలయాన్ని సందర్శించే భక్తులకు కరోనా వ్యాక్సినేషన్ ధృవీకరణ పత్రం తప్పనిసరని పేర్కొన్నారు.


Tags:    

Similar News