YCP : వైఎస్ జగన్ పై ఫైర్ అయిన మరో వైసీపీ ఎమ్మెల్యే
సింగనమల వైసీపీ ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు
వైసీపీలో టిక్కెట్ కేటాయింపులు పార్టీకి తలనొప్పిని తెచ్చి పెట్టేలా ఉన్నాయి. టిక్కెట్ దక్కని ఎమ్మెల్యేలు రాజీనామా బాట పడుతున్నారు. ఇప్పటికే మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డిలు రాజీనామాలు చేశారు. తాజాగా మరో వైసీపీ ఎమ్మెల్యే కూడా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. సింగనమల నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫేస్ బుక్ లైవ్ ద్వారా ఆమె వైఎస్ జగన్ పై మాటల దాడికి దిగారు.
నిధులు కేటాయించకుండా...
వైఎస్ జగన్ తన నియోజకవర్గానికి నిధులు ఏమీ కేటాయించలేదన్నారు. జగన్ మంత్రి పెద్ది రెడ్డి రామచంద్రారెడ్డి చెప్పినట్లే నడుచుకంటున్నారని అన్నారు. తనకు టిక్కెట్ కేటాయించడం లేదని ముఖ్యమంత్రి జగన్ తనతో చెప్పారన్నారు. నియోజకవర్గానికి ముఖ్యమంత్రి నిధులు ఏమాత్రం ఇవ్వలేదని జొన్నలగడ్డ పద్మావతి తెలిపారు. తన పట్ల, తన భర్త పట్ల మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వివక్ష చూపారన్నారు. తనకు టిక్కెట్ కేటాయించాలని కోరినా ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఎలాంటి స్పందన రాలేదన్నారు.
ఏమీ చేయలేకపోయా...
ఈ ఐదేళ్లలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కారణంగా తాను నియోజకవర్గానికి ఏమీ చేయలేకపోయానని ఆమె చెప్పుకొచ్చారు. సింగనమల నియోజకవర్గానికి నీళ్లు కూడా విడుదల చేయడం లేదన్నారు. హెచ్‌ఎస్‌బీసీ కాల్వ ద్వారా రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి, తాడిపత్రి ఎమ్మెల్యే పెద్దారెడ్డిలు చెప్పినట్లే నీటి విడుదల జరుగుతుందని ఆమె అన్నారు. వారి నియోజకవర్గాలకే నీరు విడుదల చేసుకుంటూ ఎస్సీ నియోజకవర్గాలను నిర్లక్ష్యం చేేస్తున్నారన్నారు. నీటి కోసం యుద్ధం చేయాల్సి వస్తుందని ఆమె ఫైర్ అయ్యారు. తాను రెడ్డి సామాజికవర్డం ఓట్లు వేస్తేనే ఎమ్మెల్యేను కాలేదని జొన్నలగడ్డ పద్మావతి స్పష్టం చేశారు.