28న విశాఖ బంద్ కు పిలుపు
విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ చేయబోమని కేంద్ర ప్రభుత్వం ప్రకటించేంత వరకూ తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు..
విశాఖపట్నం : ఈనెల 28న విశాఖ నగర బంద్ కు స్టీల్ ప్లాంట్ పరిరక్షణ పోరాట కమిటీ పిలుపునిచ్చింది. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరణ చేయాలన్న నిర్ణయాన్ని నిరసిస్తూ చేపట్టిన నిరాహార దీక్షలు శుక్రవారానికి 400వ రోజుకు చేరుకోనున్నాయి. ఈ సందర్భంగా పోరాట కమిటీ నేతలు విశాఖలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.
కమిటీ నేతలు మీడియాతో మాట్లాడుతూ.. విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ చేయబోమని కేంద్ర ప్రభుత్వం ప్రకటించేంత వరకూ తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ప్రైవేటీకరణను నిరసిస్తూ చేస్తున్న నగర బంద్ కు ప్రజలు, రాజకీయ పార్టీలు మద్దతివ్వాలని పిలుపునిచ్చారు. త్వరలోనే 100 మంది ఎంపీల సంతకాలతో ఢిల్లీకి వెళ్లి పోరాడుతామని, వారంరోజులపాటు అక్కడే ఉండి కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చేలా ప్రయత్నాలు చేస్తామని తెలిపారు.