ఆర్5 జోన్ విషయంలో ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో షాక్
అమరావతిలోని ఆర్5 జోన్ విషయంలో ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో షాక్ తగిలింది.
అమరావతిలోని ఆర్5 జోన్ విషయంలో ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో షాక్ తగిలింది. ఆర్5 జోన్ పై ఏపీ హైకోర్టు ఆర్డర్ పై స్టే విధించేందుకు సుప్రీంకోర్టు ధర్మాసనం నిరాకరించింది. అలాగే ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. వివరణ ఇచ్చేందుకు ప్రతివాదులకు మూడు వారాల గడువిస్తూ తదుపరి విచారణను నవంబర్ నెలకు వాయిదా వేసింది. ఆర్5 జోన్ లో ఇళ్ల నిర్మాణాలను ఆపేయాలంటూ హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. హైకోర్టు ఉత్తర్వులను ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన ఇళ్ల నిర్మాణం కోసమే ఆర్5 జోన్ లో ఈ ప్రాజెక్టును చేపట్టామని ధర్మాసనానికి ప్రభుత్వం తరపు లాయర్ తెలిపారు. అయినప్పటికీ హైకోర్టు ఆర్డర్ పై స్టే ఇచ్చేందుకు సుప్రీం నిరాకరించింది.
అమరావతి రాజధాని కేసును విచారిస్తున్న జస్టిస్ సంజీవ్ ఖన్నాతో కూడిన ధర్మాసనమే ఆర్5 జోన్ కేసును విచారించింది. ఈ కేసులో నిర్ణయం తీసుకునే ముందు తమ వాదనలు కూడా పరిగణనలోకి తీసుకోవాలని అమరావతి రైతులు కేవియట్ దాఖలు చేశారు. రాజధాని అమరావతిలో స్థానికేతరులకు ఇళ్ల స్థలాలను కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం మార్చి 31వ తేదీన జీవో జారీ చేసింది. దీంతో మంగళగిరి మండలంతో పాటు తుళ్లూరు మండలంలోని కొన్ని గ్రామాలలో మొత్తం 900.97 ఎకరకాలను ఆర్ 5 జోన్‌గా మార్చింది. అదే విధంగా ఎస్ 3 జోన్‌లోని 233.61 ఎకరాలను సైతం ఆర్ 5కి ప్రభుత్వం జోడించింది. దీనిపై రాజధాని రైతులు హైకోర్టును తొలుత ఆశ్రయించగా.. అక్కడ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. ఆర్ 5 జోన్లో ఇళ్ల నిర్మాణాలపై స్టే ఇచ్చింది. దీంతో దీనిపై ప్రభుత్వం సుప్రీంను ఆశ్రయించింది. ఇక ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో కూడా ఎదురుదెబ్బ తగిలింది.