Breaking : జనసేన, టీడీపీ కలిసే వెళతాయి : పవన్

ఈరోజు ములాఖత్ ఏపీ రాజకీయాల్లో కీలకమైనదని జనసేన అధినేత పవన్ కల్యాణ్ తెలిపారు.;

Update: 2023-09-14 07:48 GMT
Breaking : జనసేన, టీడీపీ కలిసే వెళతాయి : పవన్
  • whatsapp icon

ఈరోజు ములాఖత్ ఏపీ రాజకీయాల్లో కీలకమైనదని జనసేన అధినేత పవన్ కల్యాణ్ తెలిపారు. తాను ఎన్డీఏలో ఉన్నానని, బీజేపీ ఏ నిర్ణయం తీసుకున్నా సరే అందరం కలసి వెళితేనే ఈ అరాచకాన్ని ఎదుర్కొనగలమని అన్నారు. చంద్రబాబుతోములాఖత్ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. వైసీపీ దుష్టపాలనను అంతం చేయాల్సిందేనని చెప్పారు. సమిష్టిగా ఎదుర్కొనాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పారు. తాను మొన్నటి వరకూ ఏ నిర్ణయం తీసుకోలేదని, ఈరోజు జనసేన తెలుగుదేశం పార్టీ వచ్చే ఎన్నికల్లో కలసి వెళతాయని ఆయన చెప్పారు. ఏపీ భవిష్యత్ కోసం కలసి పోటీ చేస్తామని పవన్ తెలిపారు. ఈ పరిస్థితి వైఎస్ జగన్ తీసుకువచ్చారన్నారు. రేపట్నించి జనసేన, టీడీపీ సంయుక్తంగా కార్యాచరణను ప్రకటిస్తామని తెలిపారు. జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాటు చేసి ఐక్యంగా ప్రభుత్వాన్ని ఎదుర్కొంటామని తెలిపారు.

నాలుగున్నరేళ్లుగా...
గత నాలుగున్నర సంవత్సరాలుగా అరాచకపాలనను ఏపీలో చూస్తున్నామన్నారు. అందులో భాగంగానే టీడీపీ అధినేత చంద్రబాబుపై అక్రమ కేసులు పెట్టి చట్టవిరుద్ధంగా జైలులో పెట్టారన్నారు. ఇది బాధాకరమని తెలిపారు. ఇందులో భాగంగా సంఘీభావం తెలిపేందుకు ఇక్కడకు వచ్చానని చెప్పారు. గతంలో చంద్రబాబుకు, తనకు గతంలో విధానపరమైన విభేదాలున్నాయని, అయితే రాష్ట్రం బాగుండాలని తాను ఎప్పుడూ కోరుకుంటానని తెలిపారు. 2014లో జనసేన ప్రారంభించినప్పుడు రాష్ట్ర విభజన జరిగిన సమయంలో కాంగ్రెస్ సరైన న్యాయం చేయలేకపోయిందని, రాజధాని లేకుండా పోయిందని కూడా నాడు చెప్పానన్నారు. అందుకే నరేంద్ర మోదీ, చంద్రబాబుకు మద్దతు తెలిపానని పవన్ కల్యాణ్ తెలిపారు.
వెనక్కు వెళ్లను...
తాను ఒక నిర్ణయం తీసుకుంటే వెనక్కు వెళ్లనని పవన్ అన్నారు. 2020 విజన్ అన్నప్పుడు చాలా మందికి అర్థం కాలేదని, కానీ ఈరోజు మాదాపూర్‌కు వెళితే అదేంటో తెలుస్తుందన్నారు. ఆయన విజన్ అటువంటిదని ప్రశంసించారు. అలాగే తాను ప్రత్యేక హోదా విష‍యంలో తాను చంద్రబాబును విభేదించానని చెప్పారు. అనుభవం ఉన్న నాయకుడు కావాలనే 2014లో తాను మద్దతిచ్చానని తెలిపారు. సైబరాబాద్ నగరాన్ని నిర్మించిన వ్యక్తికి కేవలం మూడు వందల కోట్ల స్కామ్ పేరు చెప్పి జైలులో కూర్చోబెట్టడం సరికాదని పవన్ అభిప్రాయపడ్డారు. ఈ నిందమోపిన వ్యక్తి ఒక హార్డ్ కోర్ క్రిమినల్ అని పరోక్షంగా జగన్ పై విమర్శలు చేశారు. చంద్రబాబు అరెస్ట్ రాష్ట్రానికి మంచిది కాదని పవన్ అన్నారు. ఆర్థిక నేరాలకు పాల్పడి జైలులో ఉన్న వ్యక్తి చంద్రబాబును జైలులో పెడతారా? అని పవన్ ప్రశ్నించారు.
ప్రశ్నిస్తే కేసులా?
జగన్ తీసుకునే ప్రతి నిర్ణయం రాజ్యాంగ విరుద్ధమైనవేనని పవన్ అన్నారు. అందరినీ భయభ్రాంతులకు గురి చేస్తూ పాలన సాగిస్తున్నారన్నారు. ఆయన అవినీతి ఆరోపణలు చేయడం హాస్యాస్పదమన్నారు. జగన్ చెప్పిన హామీలన్నీ నిలబెట్టుకున్నారా? అని నిలదీశారు. వైసీపీ పాలనలో అడ్డగోలుగా అవినీతి జరుగుతుందన్నారు. ఎవరు ప్రశ్నించినా వారిపై కేసులు నమోదు చేస్తున్నారన్నారు. కనీసం ఏపీకి రాకుండా తనను అడ్డుకోవడం ఏంటని ఆయన ప్రశ్నించారు. అందుకే వ్యతిరేక ఓటు చీలనివ్వని తాను 2020లోనే చెప్పానని పవన్ అన్నారు. వైసీపీ కారణంగానే తాను ఆ వ్యాఖ్యలను చేశానని తెలిపారు. వైఎస్ వివేకా హత్య కేసులో అందరూ దోషులను చూపుతున్నా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్నారు. అందరం పొలిటికల్ గేమ్ ఆడితే రాష్ట్రం సర్వనాశనం అవుతుందన్నారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్కరినీ వదలబోమని పవన్ స్పష్టం చేశారు. వైసీపీ పాలనతో విసిగిపోయామన్న ఆయన ఆ పార్టీని అధికారం నుంచి సాగనంపాల్సిందేనని అన్నారు. 
Tags:    

Similar News