Chintamaneni Prabhakar : చింతమనేని కినుక వహించారా? అసలు రీజన్ ఏంటి?
టీడీపీ సీనియర్ నేత ఫైర్ బ్రాండ్ లీడర్ చింతమనేని ప్రభాకర్ పేరు ఎక్కడా వినిపించలేదు. కనిపించడం లేదు
టీడీపీ సీనియర్ నేత ఫైర్ బ్రాండ్ లీడర్ చింతమనేని ప్రభాకర్ పేరు ఎక్కడా వినిపించలేదు. పార్టీ అధికారంలోకి వచ్చినా ఆయన కనిపించకపోవడం చర్చనీయాంశమైంది. తాను గెలిచి, పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా చింతమనేని మౌనంగా ఉండటానికి గల కారణాలపై పార్టీలో నేతలు సయితం ఆఫ్ ది రికార్డుగా చర్చించుకుంటున్నారు. ఆయన దెందులూరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. చింతమనేని ప్రభాకర్ ఇప్పటికి మూడుసార్లు దెందులూరు నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. తెలుగుదేశం పార్టీ నేతగానే కొనసాగుతు్నారు. 2009లో వైఎస్ హవాలోనూ చింతమనేని గెలుపొందారు. తర్వాత 2014లో గెలిచి పార్టీ విప్ గా వ్యవహరించారు. 2019 ఎన్నికల్లో మాత్రం వైసీపీ అభ్యర్థి అబ్బయ్య చౌదరి చేతిలో ఓటమి పాలయ్యారు. తిరిగి 2024 ఎన్నికల్లో ఆయన విజయం సాధించారు.
బలమైన నేతగా...
చింతమనేని ప్రభాకర్ టీడీపీలో ఫైర్ బ్రాండ్ లీడర్ గా గుర్తింపు పొందారు. అప్పట్లో తహసిల్దార్ వనజాక్షిపై దాడి చేసి రాష్ట్ర వ్యాప్తంగా సంచలనానికి కారణమయ్యారు. ఏలూరు జిల్లాలో చింతమనేని ప్రభాకర్ తెలుగుదేశం పార్టీకి బలమైన నేతగా గుర్తింపు పొందారు. 2019 ఎన్నికల్లో ఓటమి పాలు కావడంతో ఆయన ఏ టీడీపీ నేత ఎదుర్కొనన్ని కేసులు ఎదుర్కొన్నారు. చింతమనేని ప్రభాకర్ జైలుకు కూడా వెళ్లి వచ్చారు. అలా గత ఐదేళ్లు అనేక కష్టాలు పడినా పసుపు జెండాను మాత్రం వదిలిపెట్టలేదు. అధికార పార్టీ బెదిరింపులకు తలొగ్గలేదు. రాజీకి రాలేదు. ఎన్ని కేసులనైనా ఎదుర్కొంటానని దైర్యంగా చెప్పిన నేత చింతమనేని ప్రభాకర్ మాత్రమేనని పార్టీలో అందరూ ఒప్పుకుంటారు.
కేబినెట్‌లో చోటు దక్కక...
కానీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న పరిణామాలు చింతమనేని ప్రభాకర్‌ను బాధించాయంటున్నారు. తనకు మంత్రి పదవి వస్తుందేమోనని ఆయన నమ్మారు. మూడు సార్లు గెలవడంతో పాటు పార్టీలో ఉన్నందున అనేక ఇబ్బందుల పాలయ్యానని, తనకు మంత్రి పదవిని ఈసారి ఇస్తారని ఆయన గట్టిగా విశ్వసించారు. అయితే కూటమి ప్రభుత్వం కేబినెట్ లో ఆయనకు చోటు దక్కలేదు. అయితే సామాజికవర్గాల సమీకరణల ఆధారంగానే చింతమనేని ప్రభాకర్‌కు కేబినెట్ లో చోటు దక్కలేదని, త్వరలోనే ఏదో ఒక కేబినెట్ ర్యాంకు పదవి ఇవ్వాలని చంద్రబాబు నాయుడు భావిస్తున్నట్లు సమాచారం అందుతోంది.
వాళ్ల చేరికతో...
మరోవైపు ఏలూరు జిల్లాలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు కూడా చింతమనేని ప్రభాకర్‌ను బాధిస్తున్నాయంటున్నారు. ఏలూరు జిల్లా పరిషత్ ఛైర్మన్ ఘంటా పద్మశ్రీ, ఆమె భర్త వైసీపీ బీసీ సెల్ అధ్యక్షుడు ఘంటా ప్రసాదరావులను పార్టీలో చేర్చుకోవడంపై చింతమనేని ప్రభాకర్ కినుక వహించారని తెలిసింది. వైసీపీ అధికారంలో ఉండగా ఇద్దరూ చంద్రబాబుపైన, టీడీపీపైన విమర్శలు చేయడమే కాకుండా, తనపై కేసులు నమోదు కావడం వెనక కూడా వారు ఉన్నారన్న కారణంతో వాళ్ల రాకను విభేదిస్తున్నారు. కానీ దంపతులిద్దరూ లోకేష్ సమక్షంలో టీడీపీ కండువా కప్పుకోవడంతో చింతమనేని ప్రభాకర్ కొంత అసంతృప్తితో ఉన్నట్లు తెలిసింది. వాళ్ల వల్ల ఉపయోగం లేకపోయినా, కనీసం తమను సంప్రదించకుండా పార్టీలో చేర్చుకోవడంపై చింతమనేని కినుక వహిచారంటున్నారు.