Tirumala : గురువారం తిరుమలలో రష్ ఎలా ఉందంటే?

తిరుమలలో భక్తుల రద్దీ కొంత పెరిగింది. గురువారం కావడంతో అధిక సంఖ్యలో భక్తులు తిరుమలకు చేరుకుంటున్నారు

Update: 2024-08-08 02:54 GMT

తిరుమలలో భక్తుల రద్దీ కొంత పెరిగింది. నిన్నటి వరకూ స్వామి వారి దర్శనానికి నేరుగా దర్శంచుకునే వీలుంది. కంపార్ట్‌మెంట్లలో వేచి ఉండకుండానే భక్తులు నిన్నటి వరకూ శ్రీవారిని దర్శించుకున్నారు. అయితే గురువారం మాత్రం తిరుమలలో కొంత భక్తుల రద్దీ పెరిగింది. ఇక రేపటి నుంచి ఆదివారం వరకూ భక్తుల సంఖ్య అధికంగా ఉంటుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు అంచనా వేస్తున్నారు. అందుకు తగినట్లుగా సౌకర్యాలు కల్పించేందుకు సిద్ధమవుతున్నారు. శ్రావణమాసం ప్రారంభం కావడంతో తిరుమలలో భక్తుల రద్దీ ఒక్కసారిగా పెరిగిందని అధికారులు చెబుతున్నారు. భక్తులకు కంపార్ట్‌‌మెంట్లలోనే అన్న ప్రసాదాలను శ్రీవారి సేవకులు పంపిణీ చేస్తున్నారు. నిన్నటి వరకూ కొంత బోసిపోయిన తిరుమల మాడవీధులు నేడు భక్తులతో కళకళలాడుతున్నాయి. భక్తుల రద్దీ పెరగడంతో ఆదాయం కూడా పెరిగిందని అధికారులు తెలిపారు.

పదమూడు కంపార్ట్‌మెంట్లలో...
ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని పదమూడు కంపార్ట్‌మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. ఉచిత దర్శనం క్యూ లైన్ లోకి టోకెన్లు లేకుండా ఈ రోజు ఉదయం ఏడు గంటలకు ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం ఎనిమిది గంటల సమయం పడుతుందని అధికారులు తెలిపారు. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం రెండు నుంచి మూడు గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. నిన్న తిరుమల శ్రీవారిని 75,109 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 30,285 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారని అధికారులు తెలిపారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.40 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందని టీటీడీ అధికారులు తెలిపారు.


Tags:    

Similar News