Nagababu : నాగబాబు మంత్రిపదవికి బ్రేక్ పడిందా? రీజన్ ఇదేనా?
జనసేన నేత నాగబాబు మంత్రిపదవికి బ్రేకులు పడినట్లు పెద్దయెత్తున ప్రచారం జరుగుతుంది.;

జనసేన నేత నాగబాబు మంత్రిపదవికి బ్రేకులు పడినట్లు పెద్దయెత్తున ప్రచారం జరుగుతుంది. ఆయన ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. కొద్దికాలం క్రితం పార్టీ పవన్ కల్యాణ్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా నాగబాబుకు మంత్రి పదవి ఇస్తామని చెప్పారు. ఉగాది రోజున ఆయన మంత్రివర్గంలో ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉంటుందన్న వార్తలు కూడా వచ్చాయి. కానీ అలాంటి వాతావరణం కనిపించకపోవడం ఇప్పుడు పార్టీలోనూ, జనసైనికుల్లోనూ చర్చనీయాంశమైంది. ఉగాదికి ఇంకా వారం రోజులు కూడా సమయం లేదు. దీనికి సంబందించిన అప్ డేట్ ఇంత వరకూ రాకపోవడంతో కొంత జనసైనికుల్లో ఆందోళన నెలకొంది. దీనిపై అధికారిక పర్యటన ఇటీవల కాలంలో కూడా రాకపోవడం చర్చనీయాంశంగా మారింది.
ఎమ్మెల్సీని చేసినా...
నాగబాబును తొలుత రాజ్యసభకు ఎంపిక చేయాలని భావించినా ఆ ఆలోచనను మానుకుని మంత్రివర్గంలోకి తీసుకుందామని పవన్ కల్యాణ్ డిసైడ్ అయ్యారు. తన సోదరుడు పార్టీకోసం పడిన కష్టానికి తగిన ప్రతిఫలాన్ని ఇవ్వాలన్నది ఆయన నిర్ణయం. ఇందులో కుటుంబం, వారసత్వం, కులం వంటివి లేవని, కేవలం పనిచేసిన వారందరికీ వరసగా ప్రాధాన్యత ఇస్తామని చెబుతూ వస్తున్నారు. కానీ పిఠాపురంలో జరిగిన జనసేన ఆవిర్బావ వేడుకల తర్వాత కొంత మారినట్లు కనిపిస్తుంది. ఇద్దరం మంత్రివర్గంలో ఉండే కంటే నాగబాబుకు పార్టీ బాధ్యతలను అప్పగించి జిల్లాల పర్యటనలు చేయించాలన్న ఆలోచనలో పవన్ కల్యాణ్ ఉన్నట్లు చెబుతున్నారు.
పార్టీని బలోపేతం చేయడానికి...
తనకు తరచూ ఆరోగ్య సమస్యలు తలెత్తుతుండటంతో పార్టీపై ఫోకస్ పెట్టాలంటే నాగబాబు మంత్రిపదవి లో కంటే పార్టీలో కీలకంగా ఉంటేనే మంచిదన్న భావనలో పవన్ కల్యాణ్ ఉన్నారని చెబుతున్నారు. అందుకే నాగబాబుకు ఈ విషయం చెప్పినట్లు కూడా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. జిల్లాలు తిరుగుతూ పార్టీని బలోపేతం చేయాలని నాగబాబుకు పవన్ కల్యాణ్ సూచించినట్లు తెలిసింది. ఆంధ్రప్రదేశ్ కేబినెట్ లో ఒకటే ఒక మంత్రి పదవి ఖాళీగా ఉంది. అందులోనూ నాగబాబు చేరిపోతే ఇక పార్టీని పట్టించుకునే వారు లేరు. నాదెండ్ల కూడా కేబినెట్ లో ఉండటం కూడా ఇందుకు కారణం. మరొకవైపు ఉగాది రోజున చంద్రబాబు ప్రతిష్టాత్మకైన పీ4 పథకం ప్రారంభించేందుకు అట్టహాసంగా పనులు మొదలు పెట్టడంతో ఇక నాగబాబుకు అమాత్య పదవి లేనట్లేనన్న కామెంట్స్ మాత్రం ఎక్కువగా వినిపిస్తున్నాయి.