Chandrababu Cabinet : కేబినెట్ లో పక్కన పెట్టడానికి అసలు రీజన్ ఇదేనా? యనమల లేని కేబినెట్ ఇదే ఫస్ట్

చంద్రబాబు నాయుడు ఈసారి కేబినెట్ లో సీనియర్ నేతలకు మొండి చేయి చూపించారు.

Update: 2024-06-12 07:16 GMT

చంద్రబాబు నాయుడు ఈసారి కేబినెట్ లో సీనియర్ నేతలకు మొండి చేయి చూపించారు. సీనియర్ నేతలు ఎవరినీ ఈసారి పరిగణనలోకి తీసుకోలేదు. యనమల రామకృష్ణుడు నుంచి మొదలు పెడితే... అమర్‌నాధ్ రెడ్డి వరకూ ఎవరికీ తన మంత్రివర్గంలో ఛాన్స్ ఇవ్వలేదు. తెలుగుదేశం పార్టీలోకి యువరక్తం ఎక్కించాలన్న ఉద్దేశ్యంతోనే చంద్రబాబు ఈ రకమైన నిర్ణయాలు తీసుకున్నట్లు స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే భవిష్యత్ లో ఎలాంటి రాజకీయ పరమైన ఇబ్బందులు తలెత్తకుండా చంద్రబాబు ముందు జాగ్రత్త చర్యగా ఈ చర్యలు తీసుకున్నారు. దీంతో పాటు సామాజికవర్గాలకు అధిక ప్రాధాన్యత ఇచ్చినట్లు కనపడుతుంది.

యనమలకు నో ఛాన్స్....
ముఖ్యంగా యనమల రామకృష్ణుడు లేని చంద్రబాబు కేబినెట్ ఇదే మొదటిది అని చెప్పాలి. ఎందుకంటే చంద్రబాబు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా యనమల రామకృష్ణుడు ఖచ్చితంగా మంత్రిగా ఉంటారు. ప్రాధాన్యత కలిగిన శాఖనే ఆయనకు అప్పగించే వారు. శాసనసభ వ్యవహారాలతో పాటు ఆర్థిక శాఖ వంటివి యనమల రామకృష్ణుడుకు అప్పగించి చంద్రబాబు చాలా వరకూ రిలీఫ్ ఫీలవుతారు. ఇప్పుడు శాసనమండలిలో యనమల రామకృష్ణుడు సభ్యుడుగా ఉన్నారు. ఆయనను కేబినెట్ లోకి తీసుకోలేదంటే నిజంగా తెలుగుదేశం పార్టీ లోని నేతలకు మాత్రమే కాదు క్యాడర్ కు కూడా అత్యంత ఆశ్చర్యకరమైన విషయం. యనమల రామకృష్ణుడు స్థానంలో కొలుసు పార్థసారధికి ఆ సామాజికవర్గం నుంచి చోటు కల్పించారు. బీజేపీ నుంచి మంత్రి అయిన సత్యకుమార్ ది కూడా అదే కమ్యునిటీ.
సుదూర ఆలోచనే...
అంటే చంద్రబాబుకు సూదూర ఆలోచన చేసి ఉంటారన్నది తెలుగుదేశం పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు. ఎప్పుడూ పాతమొహాల వల్ల ప్రజలు కూడా విసిిగిపోయి ఉన్నారని, అందుకే మంత్రివర్గంలో కొత్త వారికి చోటు కల్పించేందుకు ఆయన ధైర్యంగా ఒక అడుగు ముందుకు వేశారనే చెప్పాలి. ఎందుకంటే యనమల రామకృష్ణుడును పక్కన పెట్టడమే ఇందుకు ఉదాహరణ. ఆయన కుటుంబంలో కుమార్తెతో పాటు వియ్యంకుడు, అల్లుడికి కూడా టిక్కెట్లు కేటాయించి ప్రాధాన్యత కల్పించినప్పటికీ మంత్రివర్గంలో యనమలకు మాత్రం స్థానం కల్పించకపోవడానికి ఇదొక కారణంగా చెబుతున్నారు అదే సమయంలో మరికొందరు సీనియర్లను కూడా చంద్రబాబు నిర్దాక్షిణ్యంగా పక్కన పెట్టినట్లే కనిపిస్తుంది. అందుకు కారణాలు బయటకు కనిపిస్తున్నవి కాకపోయినా లోలోపల మరికొన్ని ఉన్నాయని అనుకుంటున్నారు తెలుగు తమ్ముళ్లు.
సుదీర్థ కాలం నుంచి...
పార్టీకి సుదీర్ఘకాలం నుంచి పనిచేస్తున్న వాళ్లను కూడా మంత్రివర్గంలోకి పరిగణనలోకి తీసుకోలేదు. ధూళిపాళ్ల నరేంద్రకు మరోసారి రాజకీయంగా ఇబ్బంది ఎదురయింది. ఈసారి కూడా నరేంద్రకు కేబినెట్ లో స్థానం దక్కలేదు. అదే సమయంలో యరపతినేని రాజేశ్వరరావు, ప్రత్తిపాటి పుల్లారావు వంటి వారిని కూడా పక్కన పెట్టారంటే చంద్రబాబు ఆలోచనలు ఏమై ఉంటాయన్నది మాత్రం ఇంకా అర్థం కాకుండా ఉందని, వారి సన్నిహితులు, అనుచరులు తలలు పట్టుకుంటున్నారు. ఇలా ఎందుకు జరిగిందని ఆలోచన చేస్తే తలలు బొప్పి కడుతున్నాయని పార్టీ నేతలు చెబుతున్నారు ముఖ్యంగా పరిటాల సునీతను కూడా పక్కన పెట్టారంటే చంద్రబాబు ఈసారి కొత్త తరహా ఆలోచనలో ముందుకు వెళుతున్నారని చెప్పకనే తెలుస్తోంది. అలెక్సా... ఏం జరిగిందో నువ్వైనా చెప్పవూ...


Tags:    

Similar News