Tirumala : క్యూ లైన్ వెలుపలి వరకూ.. తిరుమలలో నేడు రద్దీ ఎలా ఉందంటే?
తిరుమలలో భక్తుల రద్దీ అధికంగా ఉంది. ఆదివారం కావడంతో భక్తుల సంఖ్య ఎక్కువగా ఉంది
తిరుమలలో భక్తుల రద్దీ అధికంగా ఉంది. ఆదివారం కావడంతో భక్తుల సంఖ్య ఎక్కువగా ఉంది. తిరుమలలోని వీధులన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. వసతి గృహాలు, లడ్డూ కౌంటర్లు... ఇలా ఒకటేమిటి.. ఎక్కడచూసినా చాంతాండంత క్యూలైన్లే. ఎక్కడ చూసినా జనమే. ఎక్కడ విన్నా గోవింద నామస్మరణే. గత కొద్ది రోజుల నుంచి తిరుమలలో భక్తుల రద్దీ పెరిగడంతో అందుకు అవసరమైన ఏర్పాట్లను తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు చేస్తున్నారు. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం మూడు నుంచి నాలుగు గంటల సమయం పడుతుంది.
ఆదాయం కూడా...
ఈరోజు తిరుమలలోని వైకుంఠ క్యూ కాంప్లెక్స్‌లోని అన్ని కంపార్ట్‌మెంట్లలో భక్తులతో నిండిపోయాయి. బయట టీబీసీ వరకూ క్యూలైన్ విస్తరించి ఉంది. ఉచిత దర్శనం క్యూ లైన్ లోకి ఈరోజు ఏడు గంటలకు వచ్చే భక్తులకు శ్రీవారి దర్శనం పద్దెనిమిది గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. క్యూ లైన్ లో ఉన్న భక్తులకు శ్రీవారి సేవకులు ఉచిత అన్న ప్రసాదాలను పంపిణీ చేస్తున్నారు. భక్తులు ఇబ్బంది పడకుండా చర్యలు తీసుకుంటున్నారు. నిన్న తిరుమల శ్రీవారిని 80,404 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 35,825 మంది భక్తులు తలనీలాలను సమర్పించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.83 కోట్లు వచ్చింది.