Vallabhaneni Vamsi: వల్లభనేని వంశీ కూడా నిందితుడే.. అరెస్టు తప్పదా?
గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీ
గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీని నిందితుడిగా చేర్చారు. ఏ-71 నిందితుడిగా పేర్కొంటూ వల్లభనేని వంశీని అరెస్టు చేసేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడికి పాల్పడిన వైసీపీ నాయకుల్లో కొందరిని పోలీసులు ఇప్పటికే అరెస్టు చేశారు. టీడీపీ కార్యాలయం ఆపరేటర్ ముదునూరి సత్యవర్ధన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఐపీసీ 143, 147, 148, 435, 506 రెడ్‌విత్ 149, 3(1) (ఎస్సీ, ఎస్టీ చట్టం) సెక్షన్ల కింద కేసు (క్రైమ్ నంబర్ 137/2023) నమోదు చేశారు.
ఫిబ్రవరి 20వ తేదీన గన్నవరం టీడీపీ కార్యాలయంపై వల్లభనేని వంశీ అనుచరులు, పలువురు వైసీపీ నాయకులు దాడి చేశారని టీడీపీ నేతలు ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో టీడీపీ కార్యాలయం ఆపరేటర్ ముదునూరి సత్యవర్దన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సత్యవర్దన్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు మొదలుపెట్టారు. సీసీ కెమెరాలు, వీడియోలను పరిశీలించి దాడికి పాల్పడిన వారిని గుర్తించారు.