గోవింద కోటి రాస్తే తిరుమలలో వీఐపీ బ్రేక్ దర్శనం.. ఎవరికంటే?

యువ‌త‌లో హైంద‌వ స‌నాత‌న ధ‌ర్మ వ్యాప్తి కోసం శ్రీ‌వారి ఆల‌యం నుండే తొలి అడుగు వేస్తున్నామ‌ని;

Update: 2023-09-06 06:45 GMT

యువ‌త‌లో హైంద‌వ స‌నాత‌న ధ‌ర్మ వ్యాప్తి కోసం శ్రీ‌వారి ఆల‌యం నుండే తొలి అడుగు వేస్తున్నామ‌ని, ఇందులో భాగంగా రామ‌కోటి త‌ర‌హాలో గోవింద కోటి రాసిన 25 ఏళ్ల లోపు వారికి, వారి కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి ఒక‌సారి తిరుమ‌ల స్వామివారి బ్రేక్ ద‌ర్శ‌నం క‌ల్పిస్తామ‌ని టీటీడీ ధర్మకర్తల మండలి అధ్య‌క్షులు భూమ‌న క‌రుణాక‌ర్‌రెడ్డి వెల్ల‌డించారు. 10 ల‌క్ష‌లా 1,116 సార్లు గోవిందనామం రాసిన‌ వారికి ద‌ర్శ‌నం క‌ల్పిస్తామ‌న్నారు. తిరుమ‌ల అన్న‌మ‌య్య భ‌వ‌నంలో ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి తొలి స‌మావేశం జ‌రిగింది. ఈ సందర్భంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. సనాతన ధర్మం, మానవీయ, నైతిక విలువలపై అవగాహన కల్పించేందుకు రాష్ట్రంలో ఎల్‌కేజీ నుంచి పీజీ చదివే విద్యార్థులకు సులభంగా అర్థమయ్యేలా 20 పేజీల భగవద్గీత సారాన్ని తెలిపే కోటి పుస్తకాలు అందజేస్తామన్నారు.

సనాతన ధర్మంపై తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ చేసిన విమర్శలను భూమ‌న క‌రుణాక‌ర్‌రెడ్డి ఖండించారు. సనాతన ధర్మం మతం కాదని, అదొక జీవనయానమని చెప్పారు. ఈ విషయం తెలియక సనాతన ధర్మానికి కులాలను ఆపాదించి విమర్శలు చేయడం వల్ల సమాజంలో అలజడి చెలరేగే అవకాశం ఉంటుందన్నారు. రాజకీయపరమైన విమర్శ కావడంతో బోర్డులో తీర్మానం చేయ లేం కానీ బోర్డు అధ్యక్షుడిగా, రాజకీయనాయకుడిగా, సనాతన ధర్మాన్ని పాటించే వ్యక్తిగా తాను ఉదయనిధి వ్యాఖ్యలను వ్యతిరేకిస్తున్నానని తెలిపారు. ఇక టీటీడీ నూతన ధర్మకర్తల మండలి తొలి సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను చైర్మన్‌ మీడియాకు వివరించారు.


Tags:    

Similar News