ఆడబిడ్డ తల్లిగా ఈ ఘటన నన్ను తీవ్ర భయాందోళనకు గురిచేసింది: షర్మిల

బాలికల హాస్టల్‌లోని వాష్‌రూమ్‌లో రహస్య కెమెరాను కనుగొనడంతో

Update: 2024-08-30 10:59 GMT

బాలికల హాస్టల్‌లోని వాష్‌రూమ్‌లో రహస్య కెమెరాను కనుగొనడంతో ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లాలోని ఇంజనీరింగ్ కళాశాలలో తీవ్ర నిరసన చెలరేగింది. దీనిపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు నాయుడు విచారణకు ఆదేశించారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసి, ఫైనల్ ఇయర్ విద్యార్థిని అదుపులోకి తీసుకున్నారు. గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజి వద్ద విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో విద్యార్థినులు ఆందోళనకు దిగారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థినులు డిమాండ్ చేశారు. వర్షం పడుతున్నప్పటికీ వారు ఆందోళన కొనసాగించారు. విద్యార్థి సంఘాల నేతలు హాస్టల్ లోకి వెళ్లేందుకు ప్రయత్నించగా, పోలీసులు వారిని అడ్డుకోవడంతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది.

ఈ ఘటనపై ఏపీ కాంగ్రెస్ నేత వైఎస్ షర్మిల స్పందించారు. ఒక ఆడబిడ్డ తల్లిగా ఈ ఘటన నన్ను తీవ్ర భయాందోళనకు గురిచేసిందని, చదవు, సంస్కారం నేర్పాల్సిన విద్యాసంస్థలు పిల్లలకు ఏం నేర్పుతున్నాయోనన్న ఆలోచనలో పడేసిందని అన్నారు.
"ఆడపిల్లల బాత్ రూముల్లో హిడెన్  కెమెరాలు..
3వందలకు పైగా వీడియోలు..విషయం బయటకు పొక్కకుండా తగు జాగ్రత్తలు. గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజి అమానవీయ ఘటనపై వెంటనే చర్యలు ఉండాలి. ఒక ఆడబిడ్డ తల్లిగా ఈ ఘటన నన్ను తీవ్ర భయాందోళనకు గురిచేసింది. చదవు,సంస్కారం నేర్పాల్సిన విద్యాసంస్థలు.. పిల్లలకు ఏం నేర్పుతున్నాయోనన్న ఆలోచనలో పడేసింది. ఉన్నత చదువుల కోసం ఆడపిల్లలను కాలేజీలకు పంపితే... వారి మాన ప్రాణాలకు రక్షణ లేదనడానికి ఈ ఘటనే మరో నిదర్శనం. కాలేజిల్లో పర్యవేక్షణ కొరవడిందనడానికి సజీవ సాక్ష్యం. యాజమాన్యాల నిర్లక్ష్యానికి నిలవెత్తు దర్ఫణం. కాసుల కక్కుర్తి తప్పా.. భద్రత ప్రమాణాలు గాలికొదిలేశారనే దానికి ఈ ఘటనే ఉదాహరణ. ఈ ఘటనపై సాధారణ విచారణ కాదు. ఫాస్ట్రాక్ విచారణ జరగాలి.
తక్షణం ఉన్నతస్థాయి కమిటి వేయాలి. సీనియర్ ఐపిఎస్ అధికారులతో విచారణ జరగాలి.
బాత్ రూముల్లో కెమెరాలు పెట్టింది ఎవరో వెంటనే తేల్చాలి. రాజకీయ నాయకుడి కొడుకా..కూతురా కాదు.. కెమెరాలు పెట్టింది ఎవరైనా..ఎంతటి వారైనా కఠినంగా శిక్షించాల్సిందే. మరోసారి ఇలాంటి అఘాయిత్యానికి ఒడిగట్టాలంటే భయపడేలా చర్యలు ఉండాల్సిందే. బాత్ రూముల్లో రికార్డ్ అయిన ఏ వీడియో కూడా పబ్లిక్ కాకుండా చూడాలని పోలీస్ శాఖకు విజ్ఞప్తి చేస్తున్నాం.
వచ్చేవారం లోపు చర్యలు చేపట్టకపోతే నేను కాలేజీని సందర్శిస్తా. విద్యార్థినిలతో మాట్లాడుతా. వారు కోరుకున్నట్లు న్యాయం జరిగే వరకు వారి పక్షాన పోరాటం చేస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇస్తుంది." అంటూ వైఎస్ షర్మిల ట్వీట్ చేశారు.



Tags:    

Similar News