YSRCP : జగనూ బీ అలెర్ట్... వాళ్లు కొంపముంచేటట్లున్నారు భయ్యా? ఆపడం కష్టమేనేమో?
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈసారి ఏపీ ఎన్నికల్లో దారుణంగా ఓటమి పాలయింది.పదకొండు శాసనసభ స్థానాలకే పరిమితమయింది.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈసారి ఏపీ ఎన్నికల్లో దారుణంగా ఓటమి పాలయింది. పదకొండు శాసనసభ స్థానాలకే పరిమితమయింది. కేవలం నాలుగు పార్లమెంటు నియోజకవర్గాలకే పరిమితమయింది. ఉభయ సభల్లో పదిహేను మంది సభ్యులు వైసీపీకి ఉన్నట్లయింది. టీడీపీకి రాజ్యసభ లో ఎవరూ లేకపోవడంతో ఇప్పుడు ఉభయ సభల్లో దాని బలం పదహారు మాత్రమే. అంటే రెండు పార్టీలకు తేడా ఒకటే. అయితే ఇప్పుడు ఉన్నోళ్లు జారిపోతున్నారన్న ప్రచారం జోరుగా సాగుతుంది. కార్తీ చిదంబరం ప్రత్యేకంగా వైసీపీ ఎంపీలపై ట్వీట్లు చేయడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. వైసీపీలో ఉన్న వాళ్లు బీజేపీలో చేరతారన్న ప్రచారం మాత్రం ఢిల్లీ స్థాయిలోనూ వినిపిస్తుంది.
పార్లమెంటు సభ్యులుగా...
మొన్నటి ఎన్నికల్లో రాజంపేట నుంచి మిధున్ రెడ్డి విజయం సాధించారు. మిధున్ రెడ్డి ఎట్టిపరిస్థితుల్లో పార్టీని వీడే అవకాశం ఉండదు. ఇక కడప పార్లమెంటు నుంచి వైఎస్ అవినాష్ రెడ్డి కూడా ఉన్నారు. ఆయన కూడా వైఎస్ జగన్ ను వదలిపెట్టే అవకాశం ఎంత మాత్రం లేదు. సో వీరిద్దరి విషయంలో ఎలాంటి సందేహాలు ఎవరికీ లేవు. ఇక తిరుపతి ఎంపీ గురుమూర్తి కూడా వైఎస్ జగన్ కు అత్యంత నమ్మకమైన వ్యక్తి. జగన్ పిలిచి ఎంపీని చేశారు. దీంతో గురుమూర్తి కూడా పార్టీ గేటు దాటి బయటకు వెళ్లే అవకాశం లేదు. మొన్నటి ఎన్నికల్లో అరకు పార్లమెంటు నుంచి చెట్టి తనూజా రాణి వైసీపీ నుంచి విజయం సాధించారు. ఈ విషయంలో కొంత ఆలోచించాల్సిన విషయమని వైసీపీ నేతలు అభిప్రాయపడుతున్నారు.
రాజ్యసభ సభ్యులుగా...
వైసీపీ రాజ్యసభ సభ్యులుగా వైవీ సుబ్బారెడ్డి, గొల్ల బాబూరావు, మేడా రఘునాధరెడ్డి, విజయసాయిరెడ్డి, ఆర్. కృష్ణయ్య, ఎస్. నిరంజన్ రెడ్డి, బీద మస్తాన్ రావు, ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్ చంద్రబోస్, పరిమళ్ నత్వాని ఉన్నారు. మొత్తం పదకొండు మందిలో నలుగురైదుగురు పార్టీ మారే అవకాశముందన్న సంకేతాలు వినిపిస్తున్నాయి. జగన్ నమ్మకంగా ఇచ్చిన వాళ్లే నట్టేట ముంచి బీజేపీలోకి జంప్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకరిద్దరు రాజ్యసభ సభ్యులు టీడీపీ వైపు కూడా చూస్తున్నట్లు తెలిసింది. గతం చూసి కాకుండా కేవలం వివిధ కోణాల్లో రాజ్యసభ పదవులు ఇవ్వడం వల్ల ఇప్పడు వాళ్లు పార్టీ ఓడిపోయిన తర్వాత జారుకుంటారన్న ప్రచారం మాత్రం జోరుగా సాగుతుంది. మరి ఎవరు ఉంటారు? ఎవరు వెళతారు? అన్నది త్వరలోనే తెలియనుంది.