Ys Jagan : ఇప్పటికైనా తెలిసి వచ్చిందా..? ఓపెన్ అయిపోతున్న వైసీపీ నేతలు.. చెబుతున్నవి చెవికెక్కితున్నాయా బాసూ?

ఎన్నికల్లో ఓటమికి గల కారణాలను వైసీపీ నేతలు నేరుగా చెబుతున్నారు. బహిరంగంగానే వారు ఓటమికి గల కారణాలను చెబుతున్నారు.

Update: 2024-06-24 05:42 GMT

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఓటమికి గల కారణాలను వైసీపీ నేతలు నేరుగా చెబుతున్నారు. బహిరంగంగానే వారు ఓటమికి గల కారణాలను చెబుతున్నారు. అధికారంలో ఉన్నప్పుడు జగన్ కు నేరుగా చెప్పే అవకాశం లేకపోవడంతో ఇప్పుడు ఓపెన్ అయిపోతున్నారు. ఇంత దారుణ ఓటమిని ఎవరూ ఊహించలేదు. కలలో కూడా కలగనలేదు. సంక్షేమ పథకాలు తమను మరోసారి అధికారానికి చేరువచేస్తాయని నమ్మారు తప్పించి ప్రజలు ఇంత లోలోపల రగలి పోతున్నారని, కసితో సమయం కసం వెయిట్ చేస్తున్నారన్న విషయం నేతలకు కూడా తెలియడం లేదు. అయితే ఎన్నికల ఫలితాల తర్వాత ఒక్కొక్కరే వైసీపీ ఓటమికి గల కారణాలు చెబుతుండటం ఇప్పుడు పార్టీలో హాట్ టాపిక్ గా మారింది.

కూల్చివేతలే కారణమంటూ...
కూల్చివేతలే తమ కొంప ముంచాయని మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాధ్ తెలిపారు. ఆయన మీడియా సమావేశంలోనే ఈ వ్యాఖ్యలు చేశారు. కూల్చివేతలను ప్రజలు సహించలేకపోయారని, అదే తమ ఓటమికి ప్రధాన కారణమయిందని ఆయన విశ్లేషించారు. నాడు కూల్చకుండా ఉండి ఉంటే ఇంత దారుణమైన ఓటమి దక్కేది కాదని ఆయన తెలిపారు. ప్రజాధనంతో నిర్మించిన ప్రజావేదికను కూల్చడాన్ని ప్రజలు గుర్తు పెట్టుకుని మరీ తమ పార్టీకి వ్యతిరేకంగా ఓటు వేశారని ఆయన తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టేశారు. వైసీపీ ఓటమికి అనేక కారణాలతో పాటు కూల్చివేతలు కూడా ఒక కారణమని ఆయన ముక్తాయింపు ఇచ్చారు.
మద్యం, ఇసుక పాలసీ...
ఇక గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి కూడా ఓటమికి గల కారణాలు చెప్పేశారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలే తమ పార్టీ విజయావకాశాలను దెబ్బతీశాయన్నారు. ఆయన నేరుగా ఒక వీడియోను నెట్టింట పోస్టు చేశారు. నాసిరకం మద్యం సరఫరా చేయడం వల్ల మద్యం తాగేవాళ్లు, ముఖ్యంగా దానికి అలవాటుపడిన వాళ్లు ఫ్యాన్ పార్టీ వైపు చూడలేదన్నారు. తాము దీనిని గుర్తించి మద్యం పాలసీని మార్చాలని సజ్జల రామకృష్ణారెడ్డి, విజయసాయిరెడ్డికి చెప్పినా ఫలితం లేకుండా పోయిందని ఆవేదన చెందారు. పేద వర్గాలు మద్యం, ఇసుక పాలసీ కారణంగానే పార్టీకి దూరమయ్యారని మహేశ్వర్ రెడ్డి తెలిపారు.
ప్రజలకు దూరం కావడంతో...
అంతేకాదు పార్టీలోకిన కొందరు నేతల నోటి దురుసు కూడా తమ ఓటమికి కారణంగా ఆయన విశ్లేషించారు. టీడీపీ నుంచి వైసీపీలోకి వచ్చిన నేతలే చంద్రబాబుతో పాటు ఆయన కుటుంబ సభ్యులను దూషించడంతో ఇంత దారుణ ఓటమి సంభవించిందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. వారు నిత్యంచేసే అవమానాలే టీడీపీ అభిమానుల్లో కసిని పెంచాయని కాసు మహేష్ రెడ్డి తెలిపారు. వీళ్లిద్దరే కాదు ఎక్కువ మంది నేతలు సంక్షేమంపై పెట్టిన దృష్టి అభివృద్ధిపై పెట్టకపోవడం, తమను జనంలో ఉండమని చెప్పి, ముఖ్యమంత్రి ప్రజలకు అందుబాటులో లేకుండా పోవడం కూడా ఓటమికి ప్రధాన కారణమని గట్టిగా చెబుతున్నారు. మరి ఈ లోపాలన్నీ సవరించుకునే శక్తి జగన్ కు ఉందా? లేక తాను చేసిందే కరెక్ట్ అని ఆయన ఇప్పటికీ భావిస్తున్నారా? అన్నది మాత్రం కాలమే చెప్పాల్సి ఉంటుంది.
Tags:    

Similar News