బస్సు కిందకు దూసుకెళ్లిన కారు.. ముందు భాగం ధ్వంసం
వరంగల్ నగరంలో గురువారం మధ్యాహ్న సమయంలో రోడ్డు ప్రమాదం జరిగింది
వరంగల్ నగరంలో గురువారం మధ్యాహ్న సమయంలో రోడ్డు ప్రమాదం జరిగింది. పాదచారులు, వాహనదారులు అందరూ చూస్తుండగానే.. వేగంగా వచ్చిన కారు ఆర్టీసీ బస్సు కిందకు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో కారు నడుపుతున్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. అక్కడికి చేరుకుని కారులో ఇరుక్కుపోయిన మృతదేహాన్ని బయటికి తీసి, పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అనంతరం బస్సు వెనుక భాగంలో ఇరుక్కుపోయిన కారును బయటకు తీశారు.
ఓవర్ స్పీడ్...
ఈ ప్రమాద ఘటనలో కారు ముందు భాగమంతా ధ్వంసమయింది. ఆ కారు ధ్వంసమైన తీరును బట్టి.. మృతుడు ఎంత స్పీడ్ గా వస్తే ఇలా జరిగి ఉంటుందో అంచనా వేయొచ్చు. కాగా.. మృతుడికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. కారు నడిపిన వ్యక్తి తాగి ఉన్నాడా ? లేక పూర్తి స్పృహలో ఉండగానే ఇలా జరిగిందా ? ఆర్టీసీ బస్సు తప్పేమైనా ? ఉందా అన్న కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. దర్యాప్తులో భాగంగా బస్సులో ఉన్న ప్రయాణికులను ప్రశ్నించారు.
పల్టీలు కొట్టి....
ఇదిలా ఉండగా.. ఘట్ కేసర్ వద్ద జరిగిన మరో కారు ప్రమాదంలో యువకుడు చనిపోగా.. మరో ముగ్గురు తీవ్రగాయాల పాలయ్యారు. చౌదరిగూడ వద్ద వేగంగా వచ్చిన కారు అదుపుతప్పి పల్టీలు కొట్టింది. ఈ ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులను చికిత్స నిమిత్తం పోలీసులు ఆస్పత్రికి తరలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టానికి పంపించి, కేసు నమోదు చేశారు