ఫ్రిడ్జ్ లో మొండెం - మూసీలో తల
రెండు స్టోన్ కటింగ్ మెషీన్లు కొనుగోలు చేసి.. కాళ్లు, చేతులను వేరు చేశాడు. మృతదేహం నుండి దుర్వాసన రాకుండా..
దేశరాజధాని ఢిల్లీలో జరిగిన శ్రద్ధవాకర్ హత్య కేసు సంఘటన దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. తాజాగా ఇదే తరహా ఘటన హైదరాబాద్ లో వెలుగుచూసింది. ఓ మహిళను చంపి ఆమె మృతదేహంలో తల, మొండేన్ని వేరు చేసి ఫ్రిజ్ లో దాచాడో దుర్మార్గుడు. మలక్ పేట్ లో 6 రోజుల క్రితం మొండెం లేని మహిళ తల లభించిన కేసు విచారణలో షాకింగ్ విషయాలు వెల్లడించారు పోలీసులు. సౌత్ ఈస్ట్ డీసీపీ రోపేష్ తెలిపిన వివరాల ప్రకారం.. మృతురాలిని ఎర్రం అనురాధగా గుర్తించారు. ఆమె కేర్ ఆస్పత్రిలో నర్సుగా పనిచేస్తూ వడ్డీ వ్యాపారం చేస్తోంది. వడ్డీ వ్యాపారంలో గొడవల కారణంగానే అనురాధ దారుణ హత్యకు గురైనట్లు తెలిపారు.
అనురాధను చంపిన నిందితుడిగా చంద్రమౌళిని గుర్తించారు. అతడి ఇంట్లోనే ఆమె అద్దెకు ఉంటోంది. వడ్డీ వ్యాపారం చేస్తోన్న అనురాధ వద్ద చంద్రమౌళి రూ.18 లక్షలు అప్పు తీసుకున్నాడు. డబ్బులు తిరిగి చెల్లించే వ్యవహారంలో ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతుండటంతో.. ఆమెను అంతమొందించాలని స్కెచ్ వేశాడు. పథక ప్రకారం అనురాధను హతమార్చాడు. మే 12వ తేదీన అనురాధను కత్తితో పొడిచి హత్యచేశాడు. ఆమె తల, మొండేన్ని వేరు చేసి ఫ్రిడ్జ్ లో దాచి, మే 17న తలను మలక్ పేట పీఎస్ పరిధిలోని తీగలగూడ మూసీ నదిలో పడేశాడు. మొండేన్ని ముక్కలు చేసి ఫ్రిడ్జ్ లో భద్రపరిచాడు.
రెండు స్టోన్ కటింగ్ మెషీన్లు కొనుగోలు చేసి.. కాళ్లు, చేతులను వేరు చేశాడు. మృతదేహం నుండి దుర్వాసన రాకుండా ఫినాయిల్, డెటాల్, పెర్ఫ్యూమ్ అగరబత్తి, కర్పూరం, పెర్ఫ్యూమ్ స్ప్రే బాటిళ్లను కొనుగోలు చేసి క్లీన్ చేశాడు. క్రమం తప్పకుండా ముక్కలు చేసిన శరీర భాగాలపై పెర్ఫ్యూమ్ చల్లాడు. అనురాధ ఏమైందన్న అనుమానం రాకుండా ఉండేందుకు ఆమె సన్నిహితులకు ఆమె ఫోన్ నుండో మెసేజ్ లు పంపాడు. ఆరురోజుల క్రితం మూసీ నది వద్ద ఆమె తల లభ్యమవ్వడంతో.. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అనురాధ బంధువులు ఆమెను గుర్తించడంతో.. అనుమానితుడైన చంద్రమౌళిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా.. షాకింగ్ విషయాలు వెల్లడయ్యాయి. అప్పుగా తీసుకున్న డబ్బును తిరిగి చెల్లించాలని అనురాధ పదే పదే అడుగుతుండటంతో ఆమెను హత్య చేసినట్లు చంద్రమౌళి అంగీకరించాడు. పోలీసులు అతడిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.